గృహాలకు వీడిన గ్రహణం | pending bills released to indiramma house scheme | Sakshi
Sakshi News home page

గృహాలకు వీడిన గ్రహణం

Published Tue, Nov 18 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

pending bills released to indiramma house scheme

ఖమ్మం వైరా రోడ్: ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త. ఇళ్ల నిర్మాణాల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు నియోజకవర్గ డీఈలు, ఏఈలకు హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రగతిలో ఉన్న ఇళ్ల వివరాలు, ఇంటి కొలతలు, ప్లాట్ కొలతలు తీసుకుని ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే 5 వేల ఇళ్ల వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన ఇళ్ల వివరాలను 50 శాతం వరకు గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డెరైక్టర్‌కు పంపేందుకు సిద్ధం చేశారు. పదిరోజుల్లో 70 శాతానికి పైగా వివరాలను పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 జిల్లాలో పెండింగ్ బిల్లులు రూ. 35 కోట్లు
 మార్చి 25 నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 15 వేల ఇళ్లకు రూ.35 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

 సీబీసీఐడీ విచారణ అనంతరం...
 జిల్లాలో మూడు విడతల్లో 4లక్షల 10వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యయి. వాటిలో ఇప్పటి వరకు 2.8 లక్షలు పూర్తయ్యాయి. మరో 64వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.  దీనిపై సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది.

ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రగతిలో ఉన్న గృహాలకు బిల్లులు నిలిచిపోయాయి. సీబీసీఐడీ విచారణ పూర్తిచేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో గృహ  నిర్మాణ శాఖ అధికారులకు పెండింగ్ బిల్లు విడుదల చేసేందుకు అవకాశం లభించింది. బిల్లులు చెల్లించాల్సిన లబ్ధిదారుల వివరాలు పంపించాలని పీడీకి ఆ శాఖ మేనేజింగ్ డెరైక్టర్ నుంచి నాలుగు రోజుల క్రితం ఆదేశాలు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement