వైఎస్ ఆశయాలకు ప్రజలే సంరక్షకులు
- తెలుగు జాతి బతికున్నంత కాలం ఆయన ప్రజల గుండెల్లో ఉంటారు
- భారీ వర్షంలోనూ పరామర్శ యాత్ర జరిపి ప్రసంగించిన షర్మిల
- నాలుగోరోజు యాత్రలో ఐదు కుటుంబాలకు పరామర్శ
పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన ప్రజలను సొంత బిడ్డల్లా ప్రేమించారు. గుడిసె అనేదే లేకుండా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని కలలుగన్నారు. పేదవాడు కూడా ఉన్నత విద్య చదువుకునేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తెచ్చి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు చేసుకొనే పరిస్థితిని కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆయన బతికుంటే ప్రతి ఇల్లు కళకళలాడేది. ఇప్పుడు వైఎస్ లేకపోయినా ఆయన ఆశయాలను బతికించుకోవాలి. ప్రజలే వైఎస్ ఆశలకు, ఆశయాలకు సంరక్షకులు కావాలి..’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతున్న ‘పరామర్శ యాత్ర’లో భాగంగా నాలుగోరోజైన గురువారం షర్మిల ఐదు కుటుం బాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా కోస్గిలో భారీ వర్షంలోనూ ఆమె ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. వైఎస్‌ఆర్ మరణించి ఐదేళ్లయినా ప్రజలు ఆయనను మరవలేదని, కోట్లాది మంది ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని షర్మిల అన్నారు. జనరంజక పాలన అంటే ఏమిటో చూపించిన వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి పన్నుల భారం లేకుండా చూశారని... దేనిమీదా ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచలేదని ఆమె గుర్తుచేశారు. రాజశేఖర్‌రెడ్డికి మరణం లేదని, తెలుగుజాతి బతికున్నంత వరకు కోట్లాది ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. రాజన్న ఆశయాలను కాపాడుకుంటూ, రాజన్న రాజ్యం తెచ్చుకునేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... బంగారు తెలంగాణ కోసం వైఎస్సార్ సీపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడి పార్టీ పోరాడుతుందని, వైఎస్ ఆశయాల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు. పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ... ఉద్యమించి తె లంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ప్రజలు ఆనందంగా జీవిస్తారని భావిస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఐదు కుటుంబాలకు పరామర్శ
నాలుగోరోజు పరామర్శ యాత్ర గురువారం చిన్న వడ్డెమాన్ నుంచి ప్రారంభమైంది. తొలుత కొత్తకోట మండలం కొన్నూరులో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వికలాంగ యువతి కొన్నూరు నాగమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించి, ఆమె తల్లి వెంకటమ్మకు భరోసా కల్పించారు. అక్కడి నుంచి జడ్చర్లకు చేరుకున్న షర్మిల... అక్కడ రవూఫ్ భార్య ఖైరున్నీసా బేగంను పరామర్శించారు. అనంతరం జడ్చర్లలో, మహబూబ్‌నగర్‌లో వైఎస్ విగ్రహాలకు పూల మాలలు వేశారు. తర్వాత కొడంగల్ నియోజకవర్గంలోని అమ్లికుంట్లలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మఠం గురుబసవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అమ్లికుంట నుంచి కోస్గికి వెళుతుండగా భారీ వర్షం ముంచెత్తింది. అయినా వర్షంలోనే కోస్గికి చేరుకున్న షర్మిల... కనికె బాలరాజు ఇంటికి వెళ్లి ఆయన భార్య అంబికకు ధైర్యం చెప్పారు. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా కోస్గి చౌరస్తాలో షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి దౌల్తాబాద్‌లో చనిపోయిన మీదింటి ఫకీరప్ప భార్య నర్సమ్మను, కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా ఈ యాత్రలో పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, నల్లా సూర్యప్రకాశ్‌రావు, సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముస్తాఫా, భగవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.