పోదాం పద.. పోచంపల్లికి
► చేనేత కళా జగతికి పర్యాటక శోభ కల్పించేందుకు సర్కారు నిర్ణయం
► ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకట్టుకొనేలా బృహత్తర ప్రణాళిక
► కేంద్రం నుంచి భారీగా నిధులు పొందేందుకు యత్నాలు
► ఆన్‌లైన్‌లో నేత వస్త్రాల వ్యాపారం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు
► అంతర్జాతీయ డిమాండ్ ఉన్న డిజైన్లపై నేత కార్మికులకు శిక్షణ
► వచ్చే నెల ఐదో తేదీన కన్సల్టెంట్లతో కీలక భేటీ
చూడచక్కని చేనేత పనితనంతో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లికి మరింత ఖ్యాతి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ‘ఇక్కత్’ డిజైన్ వస్త్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లి ప్రాంతాన్ని.. గ్రామీణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ద్వారా... అక్కడి చేనేత వస్త్రాలకు డిమాం డ్ పెంచడం, నూతన డిజైన్లపై ఇక్కడి కార్మికులకు శిక్షణ ఇప్పించడం, తద్వారా నేత వస్త్రాల మార్కెటింగ్‌ను పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందుకోసం కేంద్రం నుంచి రూరల్ టూరిజం ఖాతాలో నిధులు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించిం ది. దీనికోసం ఏప్రిల్ 5న కన్సల్టెంట్లతో కీలక భేటీ నిర్వహిస్తోంది. - సాక్షి, హైదరాబాద్
ఏం చేస్తారు..?
పోచంపల్లి నేత పనిలోని నైపుణ్యాన్ని కళ్లకు కట్టే ప్రదర్శన కేంద్రాలు, ‘ఇక్కత్’ డిజైన్‌పై డాక్యుమెంటరీలు, ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఏర్పాట్లను, తెలంగాణ వంటకాలతో కూడిన భోజనశాలలను సిద్ధం చేస్తారు. పండుగల సమయంలో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పల్లె సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక చర్యలు చేపడతారు. ఈ ప్రాంతంలో తాటి వనాలు ఎక్కువగా ఉన్నందున నాణ్యమైన సంప్రదాయ పానీయం ‘నీరా’కు ప్రాచుర్యం కల్పించనున్నారు. చుట్టూ నెలకొన్న గుట్టలను ఈ ప్రాజెక్టులో భాగం చేసి వాటి వద్ద సాహసక్రీడలకు అవకాశం కల్పిస్తారు. సమీపంలోని ఆలయాలను తెలంగాణ సంప్రదాయ కేంద్రాలుగా మారుస్తారు. మొత్తంగా ఈ ప్రాంతం సందర్శనకు వచ్చేవారు పల్లె సౌందర్యాన్ని ఆస్వాదించటంతోపాటు, ‘ఇక్కత్’ వస్త్రాలు ఎలా రూపొందుతాయో తెలుసుకోగలుగుతారు. అంతేగాకుండా ఇక్కడి వస్త్రాలను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న డిజైన్లలో వస్త్రాలు రూపొందించేందుకు వీలుగా ఇక్కడి చేనేత పనివారికి ప్రత్యేక శిక్షణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ప్రత్యేకతలెన్నో..
పోచంపల్లి అనగానే వెంటనే గుర్చొచ్చేది ‘ఇక్కత్’ డిజైన్‌లోని నాణ్యమైన నేత వస్త్రాలు. ఇండోనేసియా, జపాన్‌లలో గుర్తింపు పొందిన ‘ఇక్కత్’కు మన దేశంలో పేరు తెచ్చింది పోచంపల్లే. పోచంపల్లి పరిధిలో రెండు క్లస్టర్లుగా ఉన్న దాదాపు 80 గ్రామాలకు చెందిన పది వేల కుటుంబాలు నేత పనిపైనే ఆధారపడ్డాయి. ఈ ప్రాంతం కేవలం నేత పనికే కాకుండా ప్రకృతి రమణీయతకూ గుర్తింపు పొందింది. అంతేకాదు భూదాన్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చారిత్రక ప్రాంతం కూడా. వీటన్నింటి నేపథ్యంలో పోచంపల్లి ప్రాంతాన్ని తెలంగాణ సంస్కృతికి చిరునామాగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తొలి గ్రామీణ పర్యాటక కేంద్రం
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పర్యాటక ప్రదేశాలు పెద్దగా లేవు. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లోనూ ఈ విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదు. ఒక్క హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్ అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే దక్కింది. అయితే దేశంలో గ్రామీణ పర్యాటకానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్న నేపథ్యంలో... ఈ కేటగిరీలో పోచంపల్లికి నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసి పంపనున్నారు.