సాక్షి, పాల్వంచ: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఎది పడితే అది, ఎలా పడితే అలా పోస్టింగ్‌లు పెడితే అంతే సంగతులు. పోలీసులు నిఘాపెట్టి 24 గంటల్లో కేసు నమోదు చేస్తారు. ఇలా కేసుల్లో ఇరుక్కున్నవారిని రూ.లక్ష జరిమానా లేదా 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలున్నాయి. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియా పోస్టులపై సైబర్ క్రైం పోలీసులు కన్నేశారు. ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెడితే ఇట్టే బుక్కవుతారు. హైదరాబాద్‌లో ఇటీవటి కాలంలో జరిగిన దిశ ఎన్‌కౌంటర్‌పై సీపీఎం మాజీ ఎంపీ బృందాకరత్ స్పందిస్తూ.. ‘ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం’ అంటూ పోస్ట్ చేశారు. అ అంశంపై సోషల్ మిడియాలో వచ్చిన పోస్టింగ్‌లను చూసిన పాల్వంచకు చెందిన ఓ వ్యక్తి బృందాకరత్‌పై అసభ్యకరంగా పోస్టును షేర్ చేశాడని స్థానిక సీపీఎం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమైనట్లు సమాచారం.
తప్పుడు ప్రచారం చేయొద్దు
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరి దగ్గరా ఉన్నాయి. ఆ ఫోన్లు వాడుతున్న వారికి కూడా నెట్ అందుబాటులో ఉంటోంది. దీంతో వారు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అయితే, అందులో కొన్ని పోస్టింగ్‌లు, వార్తలు తప్పుగా ఉంటున్నాయి. మరికొన్ని దుష్ప్రచారం కోసం పెడుతున్న పోస్టింగులు ఉంటున్నాయి. పలు పోస్టులు ఆత్మహత్యలు, హత్యలను ప్రేరేపించేలా ఉంటున్నాయి. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవగాన లేని అనేక మంది ఒకరు పంపిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లను ఇతరులకు పోస్టు చేయడం ద్వారా క్షణంలో వ్యాపిస్తోంది. ఇలా అనేకమంది పోస్టులు పెట్టి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అనంతరం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
పోలీసుల ప్రత్యేక దృష్టి
సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే ఇక నుంచి కుదరదు. చర్యలు తీసుకోవడంతోపాటు ప్రత్యేకంగా సైబర్‌క్రైం విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పోలీసులు నిరంతరం సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కన్నేసి ఉంచుతారు. దుష్ప్రచారం, సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశం, వ్యక్తిగత ధూషణలు, అసత్య ప్రచారాలను పోస్టు చేసిన వారిని 24 గంటల్లో గుర్తించి, ఐపీసీ 153 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదైతే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. కేసు నిర్ధారణ జరిగితే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉద్యోగానికి అనర్హలుగా గుర్తిస్తారని పోలీసు అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులూ పిల్లలపై దృష్టి సారించాలి..
తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు వినియోగించే పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. తమ పిల్లలు ఎన్ని గంటలు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు? ఏఏ అంశాలు చూస్తున్నారు? సోషల్ మీడియాలను ఫాలో అవుతున్నారా? అందులోని అంశాలకు స్పందిస్తున్నారా? అనే అంశాలను గమనించాలి. అవగాహన లేకుండా ఇష్ట మొచ్చినట్లుగా పోస్టులు పెడితే పిల్లలతోపాటు తల్లిదండ్రులూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాట్సప్‌లో ఏఏ మెసేజ్‌లను పంపుతున్నారని నిత్యం పరిశీలించాలి. అప్పుడే పిల్లల్లో భయం ఏర్పడి అసత్య పోస్టింగ్‌లు, అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టకుండా కొంతమేరకు నివారించవచ్చు.
అసత్య ప్రచారం చేస్తే చర్యలు
సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు పెట్టవద్దని భయం చెప్పాలి. ఇష్టం వచ్చిన పోస్టింగ్ పెడితే కేసులవుతాయని భయం చెప్పి అవగాహన కల్పించాలి. సమాజానికి వ్యతిరేకంగా అశాంతి కల్గించే విధంగా, వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు చేస్తూ వాట్సప్ పోస్టింగ్‌లు చేయొద్దు. అసత్య ప్రచారాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
–కేఆర్‌కే ప్రసాద్, డీఎస్పీ, పాల్వంచ
Comments
Please login to add a commentAdd a comment