
నల్లగొండ : జిల్లా పరిషత్ విభజన స్థానిక సంస్థల పోలింగ్ ముగిసిన వెంటనే జరగనుంది. ఫలితాలు వెలువడకముందే జెడ్పీని విభజించి మూడు కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ.. ఉమ్మడి జిల్లా పరిషత్ వారీగా ఉన్నటువంటి ఉద్యోగుల వివరాలతోపాటు ఫర్నిచర్, పాఠశాలల వివరాలను ఇవ్వాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచి యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత అన్ని శాఖల వారీగా విభజన జరిగి ఆయా జిల్లాలకు వెళ్లిపోయాయి. వాటితోపాటు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా పాలన రూపుదిద్దుకున్నాయి. జిల్లా పరిషత్ మాత్రం పాలక మండలి ఉమ్మడిగా ఉండడం వల్ల విభజన జరగలేదు. జూన్ 5వ తేదీ వరకు జిల్లా పరిషత్ పాలకమండలి గడువు ఉండడంతో దాన్ని విభజించలేదు. ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినా కౌంటింగ్ మాత్రం మే 23న జరగనుంది.
కౌంటింగ్‌లోపే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చనేది తెలుస్తోంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 14లోపే మూడు విడతల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. అయితే ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే జిల్లా పరిషత్ విభజన చేపడతారు. కౌంటింగ్‌లోపు నల్లగొండ జిల్లా విడిపోయి మూడు జిల్లా పరిషత్‌లు అవుతాయి. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొత్త పరిషత్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత కొత్త పాలక మండలిలు కొలువుదీరనున్నాయి.
విభజనకు వివరాలు అడిగిన పంచాయతీరాజ్ శాఖ
కొత్త మండలాలు ఏర్పడినా మండల పరిషత్‌లు మాత్రం ఇంకా పెద్దగా కొలువుదీరలేదు. పూర్తిస్థాయిలో ఎంపీడీఓలు కూడా లేరు. ఇన్‌చార్జ్‌ల పాలనలోనే సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు, వాచ్‌మన్‌లతోపాటు జిల్లా పరిషత్ సిబ్బంది, 4వ తరగతి ఉద్యోగులు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలతో పాటు ఫర్నిచర్, జీపీఎఫ్, అకౌంట్స్, విద్య, బీఆర్‌జీఎఫ్, ప్లానింగ్ విభాగాలను మూడు భాగాలుగా విభజించాల్సి ఉంది. అవి ఎన్ని ఉన్నాయనేది వివరాలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ జిల్లా పరిషత్ సీఈఓను కోరింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో లేఖలు కూడా జిల్లా పరిషత్‌కు అందాయి.
ఎన్నికల విధుల్లో అధికారులు బిజీ
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 20 తర్వాత ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్‌కు ముందే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎన్నికలకు అవసరమయ్యే పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రవాణా, పోలింగ్ సిబ్బంది తదితర విషయాలపై సీరియస్‌గా ఉన్నారు. దీంతో అధికారులు ప్రస్తుతం విభజనకు సంబంధించి ప్రక్రియను ఇంకా మొదలుపెట్టలేదు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వెంటనే విభజన ప్రక్రియను మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.