పరిషత్ ఎన్నికల్లో ఇప్పటికీ ఓట్ల శాతం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగానే ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
హైదరాబాద్ : పరిషత్ ఎన్నికల్లో ఇప్పటికీ ఓట్ల శాతం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగానే ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఫలితాలపై ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. అయిదు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును గౌరవించే సాంప్రదాయం తమదన్నారు. హంగ్ ఉన్నచోట్ల మిత్రపక్షాలు తమకు సహకరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంఐఎం కూడా తమకు మిత్రపక్షమేనని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు వేల చట్టాలను ఆమోదించుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ చట్టాలను తెలంగాణకు అనుకూలంగా ఆమోదించుకోవాలనేదే కాంగ్రెస్ నిర్ణయమన్నారు. అందుకోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని పార్టీ పరంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.