ఆదరణ తగ్గినా..అదే పని!
ఇప్పటికీ 80శాతం కుటుంబాలకు బీడీలే జీవనాధారం
కుటుంబ పోషణకు కొండంత అండ
పరిశ్రమల మూతతో ఆందోళనలో మహిళలు
కాశిబుగ్గ : సిరిసిల్లకు చేనేత పరిశ్రమ ఎలానో .. వరంగల్‌కు బీడీ కార్ఖానాలు అంత. వరంగల్ తూర్పు పరిధిలో ఏ ఇంట చూసినా మహిళలు బీడీలు చుడుతూ కనిపిస్తారు. కాశిబుగ్గ, చార్‌బౌళి, గిర్మాజీపేట, కరీమాబాద్, రంగశాయిపేట, ఖిలావరంగల్, పుప్పాలగుట్ట, లేబర్‌కాలనీ ప్రాంతాలలో బీడీలు చుట్టడం రాని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక్క కాశిబుగ్గ పరిధిలోనే దాదాపు ఎనిమిది బీడీ పరిశ్రమలు ఉండడం గమనార్హం. అయితే క్రమంగా పరిశ్రమలు మూత పడుతుండడంతో మహిళలకు ఉపాధి కరువవుతోంది. ఒకప్పుడు తూర్పు పరిధిలో 12 కార్ఖానాలు ఉంటే ప్రస్తుతం రెండు మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. 80శాతం కుటుంబాలు బీడీ పరిశ్రమ పైనే ఆధారపడి జీవించేవి. ప్రస్తుతం పరిశ్రమలు మూతపడినా ఉన్నవాటి పైనే ఆధారపడి బతుకులు వెళ్లదీస్తున్నాయి.
అండగా నిలిచిన పరిశ్రమలు
వరంగల్ తూర్పు పరిధిలో కూలినాలి చేసుకునే వాళ్లే ఎక్కువ. భర్త పనికి వెళ్లాక, ఇంట్లో పనులు పూర్తయ్యాక మహిళలు ఇంటి వద్దనే బీడీలు చుడుతూ కుటుంబ పోషణలో వేన్నీళ్లకు చన్నీళ్లలా ఉండేవారు. ఇంటిల్లిపాదీ బీడీలు చుడుతూ ఎప్పుడూ కళకళలాడేవి. ప్రస్తుతం బీడీ పరిశ్రమలు చాలావరకు మూతపడడం, బీడీల వాడకం తగ్గిపోవడంతో ఒకటిరెండు కార్ఖానాలు మాత్రమే మిగిలాయి. అయితే మహిళలు మాత్రం బీడీలు చుట్టడం మాత్రం మానలేదు. ఒకప్పుడు ఇంట్లోని ప్రతి ఒక్కరు బీడీలు చుడితే ప్రస్తుతం ఒకరు మాత్రమే ఆ పనిలో ఉంటున్నారు. వచ్చిన పనిని మర్చిపోలేక, మరో పనిలేక దీనిని వదులుకోలేకపోతున్నారు. కొంతమంది మహిళలు మాత్రం ప్రత్యామ్నాయంగా కూలి పనులకు వెళ్తున్నారు.
పాత పని మర్చిపోలేక..
నేను 35 సంవత్సరాల నుంచి బీడీలు చుడుతున్నాను. ఒకప్పుడు బీడీల మీద మంచి ఆదాయం వచ్చేది. ఇప్పుడు బీడీలు చుట్టినా కార్ఖానాలు తగ్గిపోవడంతో తీసుకోవడం లేదు. పాత పని మరువలేక.. కొద్దో గొప్పో
ఆసరాగా ఉంటుందని అదే పనిచేస్తున్నా.
- దిడ్డి సుశీల, బీడీ కార్మికురాలు
ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి
మాకు బీడీలే జీవనాధారం.. దీని మీదనే కొద్దో గొప్పో ఆదాయం వస్తే ఇల్లు గడిచేది. ఇప్పుడు బీడీలు అంటే ఈసడించుకుంటాళ్లు. ప్రభుత్వం మాకు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. మహిళలు ఇంటి వద్ద పనిచేసుకునే విధంగా ఉపాధి కల్పించాలి.
-చంద్రకళ
ఆదాయం తగ్గుతోంది ఒకప్పుడు నెలకు రూ.రెండు, మూడు వేలకుపైగా సంపాదించేదాన్ని. ఇప్పుడు బీడీలు చుడితే రూ.వెయ్యి మాత్రమే వస్తున్నాయి. కార్ఖానాలు బంద్ అయినయ్. మాకు ఉపాధి దొరకడం లేదు.
- ఆడెపు సుజాత
ఈ పని నడవడం కష్టమే..
ఒకప్పుడు బీడీలు తాగేటోళ్లు బాగా ఉండేటోళ్లు. చక్కెర బీడీలకు బాగా గిరాకీ ఉండేది. ఇప్పుడు బీడీలు ఎవరూ
తాగడం లేదు. మరో ఐదు సంవత్సరాల తరువాత ఈ పని నడవడం కష్టమే.
- ఆర్ల లలిత