లోడ్.. రిలీఫ్ | Power consumption has been reduced heavily. | Sakshi
Sakshi News home page

లోడ్.. రిలీఫ్

Published Sun, May 11 2014 12:19 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

Power consumption has been reduced heavily.

  •  తగ్గుముఖం పట్టిన వ్యవసాయ విద్యుత్ వినియోగం
  •  గత నెలతో పోలిస్తే రెండు మిలియన్ యూనిట్లు తగ్గుదల
  •  ఊపిరి పీల్చుకుంటున్న అధికార యంత్రాంగం
  •  క్రమంగా పెరుగుతున్న గృహ విద్యుత్ వినియోగం
  •  పరిశ్రమలకు పవర్  హాలిడే నుంచి మినహాయింపు
  •  నల్లగొండ, న్యూస్‌లైన్ : రబీ గండం గట్టెక్కింది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం రోజురోజుకూ తగ్గుతుండడంతో ట్రాన్స్‌కో ఊపిరి పీల్చుకుంది. వారం రోజులుగా నాన్ ఆయకట్టులో వరికోతలు ఊపందుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం రోజుల్లో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం సగానికి సగం పడిపోయింది. ఏప్రిల్ 30వ తేదీన జిల్లాలోని అన్ని అవసరాలకు 14.57 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా అది కాస్తా శుక్రవారానికి 12.67 మిలియన్ యూనిట్లకు చేరింది. వారం రోజుల వ్యవధిలో రెండు మిలియన్ యూనిట్లు మేరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది.

    ఇదిలా ఉంటే పంటల సాగుకోసం జిల్లాలో ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించే పరిస్థితి నుంచి క్రమేణా సగానికి తగ్గిపోయింది. రబీ సీజన్‌లో రోజుకు 17.62 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేటాయించినా ఎటూ సరిపోకపోవడంతో కోతలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు రేయింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయానికి వీలైనన్ని ఎక్కువ గంటలపాటు విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలతో పెద్దగా వివాదాలేవీ లేకుండానే సీజన్‌లో పంటలను కాపాడగలిగారు. ఇదిలా ఉంటే ఓ వైపు వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిపోతుండగా, మరోవైపు గృహ విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది.
     
     ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం...
     ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ వినియోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పొ చ్చు. వ్యవసాయానికి విద్యుత్ వాడకం తగ్గిపోవడంతో గృహ అవసరాలకు ఎలాంటి కోతలు పెట్టడం లేదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే పై నుంచి కోత విధిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఎలాంటి కోతలు లేకుండానే విద్యుత్ సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో పరిశ్రమలకు ప్రతి శుక్రవారం పవర్ హాల్‌డే అమలుచేశారు. కానీ ప్రస్తుతం విద్యుత్ వాడకం తగ్గిపోవడంతో ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కోత విధిస్తున్నారు. దీనిని 8వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కోత అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
     
     తగ్గిన విద్యుత్ వినియోగం..
     గత నెలతో పోలిస్తే ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. ఏప్రిల్‌లో జిల్లాకు రోజూ 17.62 మిలియన్ యూనిట్లు కేటాయించగా 16.62 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఈ నెల మొదటి, రెండో వారాల్లో కేటాయించిన కోటాకు మించి కూడా విద్యుత్ వాడకం జరిగింది. కానీ వ్యవవసాయ పనులు పూర్తయ్యే చివరి వారంలో మాత్రం విద్యుత్ వాడకం 15 నుంచి 14.57 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇక వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో ఈ నెల మొదటి వారంలో 13 మిలియన్ యూనిట్లకు చేరింది. రోజురోజుకూ విద్యుత్ వాడకం తగ్గుతుండడంతో శుక్రవారం నాటికి 12.67 మిలియన్ యూనిట్లకు చేరింది. వేసవి ఉక్కుపోత ఎక్కువగా ఉండడంతో గృహవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు భరించలేక ఎయిర్ కూలర్లు,  ఎయిర్ కండీషనర్ల వాడకం పెరిగింది. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో విద్యుత్ కొరత సమస్యలు పెద్దగా తలెత్తలేదని చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement