
ఆ సంగతి కేసీఆర్‌కు ముందే తెలుసు!
* అధికారంలోకి వచ్చాకే ముంపు మండలాలపై మాట మార్చారు
* ఉప ఎన్నిక ప్రచారంలో జవదేకర్ మండిపాటు
* మెదక్ ఎన్నికను అభివృద్ధి కోణంలో చూడాలి: రైల్వే మంత్రి సదానంద
గజ్వేల్/సంగారెడ్డి క్రైమ్: తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే ప్రతిపాదన సీఎం కేసీఆర్‌కు ముందే తెలుసని, అధికారంలోకి వచ్చాకే ఆయన మాట మార్చారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చాలు, ఆ ప్రతిపాదనతో పనిలేదని ఆనాడు ఒప్పుకొన్న కేసీఆర్.. నేడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ఆ నెపాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మోపడం సిగ్గుచేటు’ అని జవదేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ దుష్ట పాలనకు పాతర వేయాలని, దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోడీకి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-టీడీపీ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతుగా గురువారం గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అరాచక పాలనను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయొద్దని కేసీఆర్ పిలుపునివ్వడం పేదలను అవమానించడమేనన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఆయనకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ చొరవతోనే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు.
బీజేపీకి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలు రెండు కళ్లలాంటివని, వీటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. రైల్వే మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ.. మెదక్ ఉప ఎన్నికను అభివృద్ధి కోణంలో చూడాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైనందున, ఇక ప్రగతిపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కావాలన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలనే విధానానికి ప్రధాని మోడీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఆపదలో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవడంలో ఆయన ముందున్నారని కొనియాడారు.
వంద రోజుల్లోనే ప్రజల్లో భరోసా
సాక్షి, హైదరాబాద్: వంద రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజలు, స్థానిక, విదేశీ పెట్టుబడిదారుల్లో మంచి విశ్వాసాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. మెదక్ ఉప ఎన్నిక ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో పదేళ్లు కొనసాగిన మాటల ప్రభుత్వానికి కాలం చెల్లి, చేతల ప్రభుత్వం వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారని దాని కి తగ్గట్టే పాలన సాగుతోందన్నారు. మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారి హైదరాబాద్‌కు వచ్చిన జవదేకర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు.
కేసులు పెట్టినా బెదరను: కిషన్‌రెడ్డి
మెదక్ ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించడం ద్వారా టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని, లేనిపక్షంలో ప్రజలు సహించరని అన్నారు. తనపై కేసులు పెడతామంటూ కేసీఆర్ కుటుంబీకులు, హరీష్‌రావు బెదిరిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని పేర్కొన్నారు.
జగ్గారెడ్డిని సమైక్యవాదిగా చిత్రీకరిస్తున్న కేసీఆర్... కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావు, మహేందర్‌రెడ్డిలాంటి నాయకులను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మురిగిపోతుంది తప్ప.. ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు కూడా ఈ సభల్లో పాల్గొన్నారు.