కేసీఆర్ దాదాగిరి చేయి.. పాతరేయకు!
కేసీఆర్ దాదాగిరి చేయి.. పాతరేయకు!
Published Thu, Sep 11 2014 6:30 PM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM
మెదక్ ఉప ఎన్నిక పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. తాజాగా మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ .. కేసీఆర్ పై మాటల బాణాల్ని సంధించారు. మంచి కోసం చేయడానికి 'దాదాగిరి' చేసినా ఫర్వాలేదు.. కాని మీడియాను పాతరేస్తాం అనే మాటలు సమంజసం కాదు అని అన్నారు.
దాదాగిరి చేయాల్సి వస్తే తప్పును తప్పుగానే చూపించాలని.. అంతేకాని మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి జవదేకర్ విజ్క్షప్తి చేశారు. అభివృద్ది కోసం పాటు పడండి. కేంద్రప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర, రాష్ట్రం కలిసి మెలిసి ఉండాలి. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అని అన్నారు. అంతేకాని మీడియాను పాతరేస్తాం అని అనడం పద్దతి కాదు అని ఆయన ధీటుగా జవాబిచ్చారు. మీడియా కూడా బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. పాతరేస్తామని వాడిన భాషనే పాతరేయాలని కేసీఆర్ కు సూచించారు. మెదక్ జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డికి మద్దతుగా ప్రకాశ్ జవదేకర్ ప్రచారాన్ని నిర్వహించారు.
బుర్ర ఉన్నవాళ్లు బీజేపీ అభ్యర్థికి ఓటేయ్యరు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జవదేకర తప్పుపట్టారు. బుర్ర, హృదయం ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేస్తారని ఆయన అన్నారు. 25 కోట్లమంది బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు దేశంలోని పేద ప్రజల్ని అవమాన పరిచారని జవదేకర్ అన్నారు.
Advertisement