
బలమైన ప్రతిపక్షం అత్యావశ్యం
♦ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్
♦ పౌర హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపణ
♦ కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: విశ్వసనీయత కలిగిన, బలమైన విపక్షాలు లేకపోవటంతో ఇటు తెలంగాణ, అటు కేంద్రంలో అధికారపక్షాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలతో దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయ ని హెచ్చరించారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షం ఎదగ డం అవశ్యమని చెప్పారు.
‘స్వరాజ్ అభియా న్’ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాంతో కలసి ప్రశాంత్ భూషణ్ పాల్గొన్నారు. ‘నేను చెప్పిందే వినాలి, నా మాటే వేదం, ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడొద్దు.. అన్నట్టు ప్రభుత్వాలు వ్యవహ రిస్తున్నాయి. బీజేపీ హిందుత్వవాదాన్ని ప్రమోట్ చేస్తోంది. గతంలో భారీగా అక్రమా లు జరిగాయి. ఇప్పుడు అంతకు మించి జరుగుతున్నాయి. అక్రమాలను నిరోధించే వ్యవస్థలను నిర్వీర్యం చేసి యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు.
స్వయంగా ప్రధాని మోదీ అవినీతి అరోపణల్లో ఇరుక్కున్నా.. మచ్చలేని నేత అంటూ ప్రమోట్ చేస్తున్నారు’ అని విమర్శించారు. ఓ మతానికి చెందిన యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎం కుర్చీలో కూర్చో బెట్టడం దారుణమన్నారు. న్యాయవ్యవస్థ, మీడియాలోనూ అవినీతి ప్రవేశించి విశ్వసనీయత సన్నగిల్లిందని, వాటిని నమ్ముకోకుండా ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, రైతులు తీవ్ర సమస్యల్లో ఉన్నారని విమర్శించారు.
ప్రశ్నిస్తే.. ఆంధ్రా పాలకుల తొత్తులంటున్నారు..: కోదండరాం
‘మా పాలన మేం చూసుకుంటాం, ఎవరూ ఏం చెప్పొద్దు, మీరు మాకు సహకరించాల్సిం దే తప్ప ప్రశ్నించొద్దు. లేదంటే అభివృద్ధి నిరోధకులనో, ఆంధ్రా పాలకుల తొత్తులనో ముద్ర వేస్తాం’ ఇది ప్రస్తుతం తెలంగాణ పాలన తీరని కోదండరాం విమర్శించారు. ప్రజల కోసం కాకుండా కాంట్రాక్టర్ల కోసం పాలన సాగుతున్నట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. బడ్జెట్ రూప కల్పన కూడా కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకునే జరుగుతోందని దుయ్యబట్టారు. ఉద్యమ ఆకాంక్ష అమలు కావటం లేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుందని చెప్పారు.