
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి తుది గడువును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 5 వరకు పొడిగించినట్లు సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) బుధవారం తెలిపింది.
ప్రభుత్వ శాఖలు, వర్సిటీలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, సర్వీస్ అసోసియేషన్లు, పెన్షనర్లు, ఉద్యోగుల నుంచి నిర్దేశిత ప్రొఫార్మాలో అభిప్రాయాల సేకరణ కోసం ప్రకటన జారీ చేశామని తెలిపింది. పొడిగించిన గడువులోగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు ఆ సమాచారాన్ని అందజేయాలని కోరింది. సమాచార సేకరణ కోసం రూపొందించిన ప్రొఫార్మా, ప్రశ్నావళిని రాష్ట్ర ఆర్థిక శాఖ వెబ్‌సైట్ http://finance.telangana.gov.in నుంచి పొందవచ్చని సూచించింది.