మంథని : మిర్చి రైతును కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది పెట్టుబడులు మీదపడడంతో ఈసారి సాగు సగానికి తగ్గించినా మార్కెట్ మాయాజాలంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంటకు సోకిన రోగాలను అధిగమించి అమ్ముకునేందుకు సిద్ధమవుతుండగా ప్రతికూల పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి.
అమాంతం పడిపోయిన ధర
గత సీజన్‌లో క్వింటాల్‌కు రూ.ఐదువేల నుంచి రూ.1500కు ధర పడిపోవడంతో చాలా మంది రైతులు రవాణాఛార్జీలు మీదపడుతాయని కల్లాల్లోనే వదిలేశారు. కొందరు పంటను కాల్చి నిరసన తెలిపారు. తర్వాత కొద్దిరోజులకు వ్యాపారులు దరను మళ్లీ రూ.8వేలకు పెంచారు. అయినా.. గతేడాది అనుభవాలను దృష్టిలో పెటుకుని సగం మంది రైతులు సాగుకు దూరమయ్యారు. కాగా.. 15 రోజులక్రితం క్వింటాల్‌కు రూ.11,500 పలికిన ధర ఏకంగా రూ.1500 పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు.
భయపెడుతున్న మబ్బులు
వారం రోజులుగా మబ్బులు ఆవరిసున్నాయి. దీంతో పంట దెబ్బతింటుందని రైతులు భయపడుతున్నారు. పంట చేతికచ్చే సమయంలో పకృతి కన్నెరచేస్తే తమకు ఆత్మహత్యలు తప్ప మరేమీ మిగలదని ఆవేదన చెందుతున్నారు. పంట చివరి దశకు రావడంతో అనేక మంది రైతులు ఏరివేత ప్రారంభించారు. కల్లాల్లో పంటను ఆరబెట్టారు. ఈ క్రమంలో వర్షం పడినా.. మబ్బులు చాలా రోజులు ఉన్నా.. కాయ దెబ్బతింటుందని, దీంతో మార్కెట్ ధర పూర్తిగా రాకుండా పోయుందని వారు వాపోతున్నారు.
విదేశాలకు ఎగుమతి
ఉమ్మడి జిల్లాలో పండించిన మిరప దేశ, విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఏటా రూ.3 నుంచి రూ. 5 కోట్ల విలువైన వ్యాపారం ఈ ప్రాంతంలో జరుగుతుంది. వరంగల్ మిర్చి మార్కెట్‌లో ఈ ప్రాంతంలో పండించిన మిరపకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ పండించే మిరపను రంగులు, కాస్మోటిక్స్ తయారీలో వినియోగిస్తారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి సగానికి మిర్చి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని మల్లారం, తాడిచెర్ల, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, గాధంపల్లి, వల్లెంకుంట, కిషన్‌రావుపల్లి గ్రామాల పరిధిలో 3 వేల ఎకరాల్లో.. మంథని మండలం చిన్న ఓదాల, బిట్టుపల్లి, శ్రీరాములపల్లి, నాగేపల్లి, తంగెళ్లపల్లి గ్రామాలతో పాటు పెద్దపల్లి జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో పంట సాగుచేశారు.
ఆదుకోకుంటే ఆత్మహత్యలే
గత సంవత్సరం తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశించారు. వరంగల్ మార్కెట్‌తో వ్యాపారుల మాయాజాలం, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులపై కేంద్రం ధరను నిర్ణయించినా అమలుకాలేదు. ఈసారి సాగు తగ్గడంతో ధర బాగానే ఉంటుందని రైతులు ఆశించారు. కాని వ్యాపారులు పంట చేతికచ్చే సమయంలో మళ్లీ గత సంవత్సరం మాదిరగానే ధరను దించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముందు తేరుకుని మిర్చి రైతులను ఆదుకోకుంటే ఈ సారి ఆత్మహత్యలే శరణ్యమని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment