జ‍్వరమొస్తే జేబు ఖాళీ.. | Private Hospital Mafia In Khammam District | Sakshi
Sakshi News home page

జ‍్వరమొస్తే జేబు ఖాళీ..

Published Wed, Sep 25 2019 10:25 AM | Last Updated on Wed, Sep 25 2019 10:26 AM

Private Hospital Mafia In Khammam District - Sakshi

జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి

సాక్షి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా 482 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. అందులో ఖమ్మం నగరంలోనే 240 ప్రైవేటు ఆస్పత్రులు నడుస్తున్నాయి. అనధికారికంగా జిల్లాలో వందల సంఖ్యలో క్లినిక్‌లు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. సీజనల్‌ జ్వరాలు తీవ్రరూపం దాల్చడంతో చాలా మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా బెడ్లు ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది. జ్వరంతో వచ్చిన పేషెంట్లకు అవసరం లేకపోయినా అన్ని రకాల టెస్టులు రాసి.. వారి వద్ద నుంచి అందినంత గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సాధారణ జ్వరం వచ్చినా డెంగీ టెస్టుల పేరుతో రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రూ.200కోట్ల వ్యాపారం.. 
వైద్య, ఆరోగ్య శాఖ వైఫల్యంతో జిల్లాలో ఈ సీజన్‌లో జ్వరాలు తీవ్రమయ్యాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమలు వృద్ధిచెంది వాటి బారినపడి ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత రెండు నెలల కాలంలో జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు రూ.180కోట్ల నుంచి రూ.200కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ మినహా ఇంత వ్యాపారం ఏ జిల్లాలో జరగలేదని తెలుస్తోంది. ఈసారి జ్వరాల సీజన్‌ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు సిరులు కురిపించిందని చెప్పొచ్చు. అయితే వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో రోగుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ఇంత వ్యాపారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దోపిడీ జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు ఉండడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైంది.

నిబంధనలు గాలికి.. 
జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వైద్యులు ఉండాలి. అలాగే ఆస్పత్రిలో బెడ్లు, ఆపరేషన్‌ థియేటర్, ల్యాబ్, ఫైర్‌ సేఫ్టీ తదితర విషయాల్లో తప్పనిసరిగా వారు సూచించిన విధంగా ఉండాలి. ఆయా పరీక్షల ఫీజు వివరాల బోర్డులు ప్రదర్శించాలి. కానీ.. చాలా ఆస్పత్రుల్లో నిబంధనలు ఖాతరు చేయట్లేదు. అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక అర్హత లేకున్నా ల్యాబ్‌లలో టెస్టులు చేయిస్తున్నారు. అప్పుడప్పుడు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా ఒకటి, రెండు ఆస్పత్రులను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

ఆర్‌ఎంపీల వైద్యంతో ఇక్కట్లు.. 
గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ సాధారణ జ్వరం, ఇతర నొప్పులు రాగానే స్పెషలిస్ట్‌ వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడరు. ఆ వీధిలోనో, ఆ గ్రామంలోనో ఉండే ఆర్‌ఎంపీని పిలిపించుకొని చూపించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాధారణ చికిత్స అందించి నయం చేసేవారు. కానీ.. ప్రస్తుతం కొందరు ఆర్‌ఎంపీలు ధర్జనే ధ్యేయంగా రోగుల వద్ద నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. పారాసిటమాల్‌ మాత్రవేస్తే నయమయ్యే జ్వరాన్ని డెకట్రాన్‌ వంటి ఇంజక్షన్లు వేసి రోగులను మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నారని కొందరు డాక్టర్లు పేర్కొంటున్నారు. వచ్చీరాని వైద్యం వల్ల రోగులకు అంతర్గతంగా బ్లీడింగ్‌ జరిగి ప్లేట్‌లెట్స్‌ పడిపోయి మృత్యువాత పడుతున్నట్లు కొందరు వైద్యులు వివరిస్తున్నారు. సాధారణంగా రోగిని పరీక్షించిన ఆర్‌ఎంపీలు మెరుగైన వైద్యం కోసం స్పెషలిస్ట్‌ డాక్టర్ల వద్దకు తీసుకెళితే.. వెంటనే జ్వరం అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు.

దీనికి తోడు కొందరు ఆర్‌ఎంపీలు కమీషన్‌ కోసం కక్కుర్తిపడి వారు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రైవేటు యాజమాన్యాలు పేషెంట్‌ను తమ ఆస్పత్రికి తీసుకువచ్చిన ఆర్‌ఎంపీకి 30 నుంచి 50 శాతం కమీషన్‌ ముట్టజెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. చూసీచూడనట్లు ఉన్నందుకు అధిక మొత్తంలో ప్రైవేటు యాజమాన్యాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు భారీగానే నగదు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు తప్పక పాటించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆయా ఆస్పత్రులను సీజ్‌ చేస్తాం. ప్రైవేటు ఆస్పత్రులపై కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. నిబంధనలు పాటించని ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నాం. ఇటీవల కొన్నింటిని సీజ్‌ కూడా చేశాం. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం.
– డాక్టర్‌ కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement