గుర్తింపు ఏకం.. బడులు అనేకం!
► ఒకే గుర్తింపుపై రెండు.. అంతకన్నా ఎక్కువ ప్రైవేటు పాఠశాలలు
► ప్రమాణాలు లేకున్నా అనుమతినిచ్చిన డీఈవో, సిబ్బంది
► హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రైవేటు స్కూళ్ల భాగోతం
సాక్షి, హైదరాబాద్: ఒక పాఠశాలకు ఒక గుర్తింపు మాత్రమే ఇస్తారు. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే గుర్తింపు పత్రంపై రెండు కంటే ఎక్కువ పాఠశాలలు దర్జాగా కొనసాగుతారుు. ఒక పేరుతో ప్రభుత్వ గుర్తింపు పొంది.. ఆదే గుర్తింపు పత్రంతో రెండు, అంతకంటే ఎక్కువ స్కూళ్లను వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇలా వేర్వేరు పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు చివరకు ప్రభుత్వం ఆమోదించిన పాఠశాల చిరునామాతో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రైవేటు ఉన్నత పాఠశాలల ఘనకార్యమిది. పట్టణ ప్రాంతాల్లో కొన్ని యాజమాన్యాలు ఇలా ఒకే అనుమతి పత్రంతో రెండుకుపైగా స్కూళ్లు నిర్వహిస్తూ నిబంధనలకు పాతరేస్తున్నాయి.
ఆయా యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారుల సహకారం అందుతుండటంతో వాటిపై చర్యలకు తావులేకుండా పోతోంది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల పరిధిలో 4,550 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. వీటిలో 1,866 ఉన్నత పాఠశాలలున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నారుు. హైదరాబాద్ జిల్లాలో 972, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 894 హైస్కూళ్లు ఉన్నారుు.
విద్యార్థుల వివరాలు ఇవ్వడంతో..
ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ఆయా పాఠశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించిన విద్యార్థుల ఎన్‌ఆర్ (నామినల్ రోల్స్)లను విద్యా శాఖకు సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో పలు పాఠశాలల్లో నిబంధనలకు మించి విద్యార్థుల సంఖ్యను పేర్కొంటూ విద్యా శాఖ అధికారులకు ఎన్‌ఆర్‌లు సమర్పిస్తుండడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
60 మంది విద్యార్థులకు మించకూడదు
సాధారణంగా ఒక పాఠశాలలో ఒక తరగతికి గరిష్టంగా 60 మంది విద్యార్థుల కు మించకూడదు. ఈ సంఖ్యను మించి తే ప్రతి సెక్షన్ (40 మంది విద్యార్థులు)కు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అయితే చాలా పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఒకే పేరుతో మరో ప్రాంతంలో పాఠశాల శాఖ (బ్రాంచ్)ను స్థాపించి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రెండురోజుల కిందట హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు లెక్కకు మించి విద్యార్థుల సంఖ్యను చూపుతూ ఎన్‌ఆర్‌లు సమర్పించాయి. దీంతో విద్యార్థుల సంఖ్యపై అధికారులు ఆరా తీయగా.. గుర్తింపు లేకుండా స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తేలింది.
కొన్ని పాఠశాల లు కనీస ప్రమాణాలు లేకున్నా.. డీఈఓ కార్యాలయంలోని సిబ్బందితో కుమ్మక్కై దర్జాగా అనుమతులు పొందినట్లు స్పష్టమైంది. అక్రమ అనుమతులు, గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లాల అధికారుల నుంచి సమాచారం తెప్పించుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా విజిలెన్‌స విభాగంతో తనిఖీలు చేపట్టనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.