శివార్లకు ‘జల’క్!
- దాహార్తితో అల్లాడుతున్న 154 కాలనీలు
- మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు
- నిధుల విడుదలలో గ్రేటర్ నిర్లక్ష్యం
- 30 శాతం చెల్లించేందుకు 870 కాలనీలు సిద్ధం
- స్పందించని యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ శివార్లలోని కాలనీలు, బస్తీల దాహార్తిని తీర్చడంలో జీహెచ్‌ఎంసీ దారుణంగా విఫలమవుతోంది. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు ఎంపిక చేసిన 154 కాలనీల్లో మంచినీటి సరఫరాకు పైప్‌లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించేందుకు అవసరమైన రూ.30.62 కోట్ల (70 శాతం వాటా) నిధుల విడుదలలో ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పటికే 13.70 కోట్లు (సుమారు 30 శాతం) నిధులను జలమండలికి చెల్లించిన స్థానికులు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు.
70:30 పథకానికి చెల్లుచీటీ
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జలమండలికి శివారు ప్రాంతాల్లో దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటి నెట్‌వర్క్‌ను విస్తరించడం ఆర్థికంగా భారంగా పరిణమించింది. దీంతో ఈ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం స్థానిక కాలనీల ప్రజలు 30 శాతం నిధులు చెల్లిస్తే.. మిగిలిన 70 శాతం జీహెచ్‌ఎంసీ విడుదల చేయాలని ఏడాది క్రితం నిర్ణయించింది. దీంతో రంగంలోకి దిగిన జోనల్ కమిషనర్లు ఈ పథకం కింద శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో సుమారు 154 కాలనీలను ఎంపిక చేశారు. అక్కడి ప్రజలు ఈ పథకం ద్వారా మంచినీరుపొందేందుకు తమ వాటాగా 30 శాతం నిధులను జలమండలికి డిపాజిట్ చేశారు. కానీ ఏడాదిగా జీహెచ్‌ఎంసీ 70 శాతం నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
870 కాలనీలకు ఇదే దుస్థితి..
గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీల్లో తాగునీటి సరఫరా నెట్‌వర్క్ లేకపోవడంతో స్థానికులు ఫిల్టర్ ప్లాంట్లు, బోరుబావులు, ట్యాంకర్ నీళ్లపైనే ఆధారపడుతున్నారు. ఈ కాలనీ వాసుల నుంచి ఏటా ఠంఛనుగా ఆస్తిపన్ను వసూలు చేసుకొని ఖజనా నింపుకుంటున్న జలమండలి దాహార్తిని తీర్చడంలో విఫలమౌతోందని వారు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఏటా జలమండలికి ఆస్తిపన్ను వాటాగా రూ.125 కోట్లు విడుదల చేయడంలోనూ జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శివార్ల గొంతెండుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.