హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్(పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటిన సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు వివిధ విభాగాల కోటాల నుంచి ప్రత్యేక నిధులను కేటాయించనుంది. నిర్దేశిత లక్ష్యాన్ని మించి మొక్క లు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వర కు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించేందు కు సిద్ధమవుతోంది. మొక్కలు నాటే పౌరులు, యువజన, ప్రజా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఈ ప్రోత్సాహకాలను అం దజేయనుంది. మొక్కలు నాటేవారికి మొత్తం రూ.15 కోట్లతో 523 హరితమిత్ర అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది లక్ష్యం 83 కోట్ల మొక్కలు
ఐదేళ్ల కాలానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, గత నాలుగేళ్లలో 113.51 కోట్ల మొక్కలు నాటారు. 2019–20 ప్రణాళికలో భాగంగా అ న్ని జిల్లాల్లోని నర్సరీలన్నింటిలో కలిపి మొత్తం వందకోట్ల మేర మొక్కలు పెంచి, 83 కోట్ల మేర మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు.
మొక్కలు నాటేందుకే పరిమితం కాకుండా..
కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వ పచ్చదనం పెంపు, మొక్కలు నాట డాన్ని తప్పనిసరి చేస్తూ, ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటును కూడా ప్రతిపాదించింది. వర్షాల సీజన్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని హడావుడి చేయటం మాత్రమే కాకుండా, ఏడాది పొడగునా మొక్కల సంరక్షణకు ఆయా శాఖలు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రక్షణ చర్యలు చేపట్టడం, నీటి సౌకర్యం కల్పించటం, మొక్కలు నాటిన ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేయటం, అటవీ శాఖ నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయటం, ప్రతీ నెలా ఆ మొక్కల ఎదుగుదలను, బతికిన మొక్కల శాతాన్ని నమోదు చేయాలని కూడా ప్రభుత్వం సూచించింది. గత మూడేళ్లుగా మొక్కలు నాటిన ప్రాంతాల్లో, చనిపోయిన మొక్కలను గుర్తించి కొత్త వాటిని నాటాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 40 లక్షల మొక్కలను, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని ప్రణాళికను సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment