* నోట్లకట్టలు, సీడీలు, సెల్‌ఫోన్లు అప్పగించిన ఏసీబీ
* కస్టడీ గడువు తగ్గించాలని రేవంత్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ కేసులో స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల సొమ్మును ఏసీబీ అధికారులు శనివారం ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. అలాగే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో నిందితుల సంభాషణకు సంబంధించిన ఆడియో, వీడియో సీడీలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను కూడా కోర్టుకు సమర్పించారు. నిజానికి నిందితుల అరెస్ట్ తర్వాత వారిని ఈ నెల 1న కోర్టులో హాజరుపరిచినప్పుడే ఈ ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంది. అయితే నిందితులను జడ్జి నివాసంలో హాజరుపరిచినందున ఆధారాలను అప్పుడు అందించలేదు. కాగా, ఆడియో, వీడియో సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కోర్టు.. నివేదిక కోరే అవకాశముంది. మరోవైపు ఏసీబీ కస్టడీలో విచారించిన తర్వాత రేవంత్‌ను చర్లపల్లి జైలుకు తరలించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో శనివారం మెమో దాఖలు చేశారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే కస్టడీకి తీసుకోవాలని కోర్టు పేర్కొందని, ఆ తర్వాత రేవంత్‌ను ఎక్కడికి తరలించాలనే విషయాన్ని స్పష్టం చేయలేదని జడ్జి దృష్టికి తెచ్చారు. విచారణ అనంతరం జైలుకు తరలించేలా ఆదేశించాలని కోరారు. మెమోను పరిశీలించిన కోర్టు.. ఏసీబీ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అలాగే నాలుగు రోజుల కస్టడీ గడువును తగ్గించాలని మరో పిటిషన్‌ను కూడా రేవంత్ లాయర్ దాఖలు చేశారు.
కోర్టుకు సాక్ష్యాధారాలు
Published Sun, Jun 7 2015 2:27 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement