
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి అమలు చేయడం దుర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో శుక్రవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్థాయిలలో బీసీల నాయకత్వం ఎదగకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌లలో ఆరు చైర్మన్‌లు, 550 మండల పరిషత్ చైర్మన్లలో 94 చైర్మన్లు ఏ లెక్కన ఇస్తారని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల తగ్గింపునకు వ్యతిరేకంగా అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.