
సభలో ఆ ఇద్దరు కృష్ణులు !
సోమవారం నుంచి మా వారిని అనుమతించండి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీపై టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. అనంతర పరిణామాలతో గురువారం పదిమంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కావడంతో శుక్రవారం ఆ పార్టీ నేతలు అటు జిల్లాల్లో, ఇటు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిం చారు. అయితే, ఆ పార్టీకి చెందిన ఇద్దరు కృష్ణులు (నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్న ఎమ్మెల్యేలు) మాత్రం అసెంబ్లీకి వచ్చారు. అందులో ఒకరు చర్చలో పాల్గొని ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు. గురువారం సభకు అంతరాయం కలిగించిన టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి విదితమే. దీంతో ఆ పార్టీనేతలు శుక్రవారం సాయంత్రం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు నేతలు జిల్లాల్లో ఆందోళనల్లో పాల్గొన్నారు. కానీ ఆ పార్టీకి చెందిన ఆర్.కృష్ణయ్య (ఎల్‌బీ నగర్), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి) శుక్రవారం సభకు హాజరయ్యారు.
రెండురోజులకే సస్పెన్షన్ పరిమితం చేయాలి
కొద్దిసేపటి తర్వాత కృష్ణారావు వెళ్లిపోయినా ఆర్.కృష్ణయ్య చివరిదాకా ఉన్నారు. బడ్జెట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆర్థికమంత్రి ఉపక్రమిస్తుం డగా, తాను మాట్లాడతానని కృష్ణయ్య కోరారు. ‘బడ్జెట్‌పై మీరైనా మాట్లాడేందుకు సిద్ధపడడం సంతోషం.. అయితే క్లారిఫికేషన్స్ సమయంలో మాట్లాడండి’ అని స్పీకర్ సూచించడంతో ఆయన చివరి వరకు సభలోనే ఉన్నారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ, తమ సహచరుల సస్పెన్షన్‌ను రెండు రోజులకే పరిమితం చేయాలని అభ్యర్థించారు. సోమవారం నుంచి వారందరినీ సభకు అనుమతించాలని ఆయన స్పీకర్ కు విజ్ఞప్తిచేశారు. అనంతరం బీసీల సంక్షేమంపై సుదీర్ఘంగా ప్రసంగించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. కాగా, సాయంత్రం ‘దేశం’ సభ్యులు, తమ సస్పెన్షన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సమయంలో వారితో కలసి ఆయన కూడా రాజ్‌భవన్‌కు వెళ్లడం గమనార్హం.