బీసీ బడ్జెట్ అంటే సరా?
సాక్షి, హైదరాబాద్: బీసీల బడ్జెట్ అని చెప్పుకుంటే సరిపోదని, బీసీ వర్గాల అభ్యున్నతికి కేటాయించిన నిధుల్లో పెరుగుదల ఉండాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తాజా బడ్జెట్‌లో బీసీలకు చెప్పినంత గొప్పగా కేటాయింపుల్లేవని విమర్శించారు. కొన్ని పథకాలు భేషుగ్గా ఉన్నా వాటి కేటాయింపు అంకెలు అంతంతమాత్రంగానే ఉన్నాయని అన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా గురువారం ఆయన శాసనసభలో ప్రసంగించారు. బీసీలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారని, అందులో చేనేతకు సంబంధించిన రూ.1200 కోట్లు కలపడమేంటని ప్రశ్నించారు. ఎంబీసీలంటే ఎవరో తేల్చే సరికి ఏడాది గడుస్తుందని, వారి పేర కేటాయించిన రూ.వేయి కోట్ల నిధులకు ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌లకు నిధులు కేటాయించినా మిగతా కులాల సంగతే పట్టించుకోలేదన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు నిధుల్లో కోత పెట్టారని, రెండు పడక గదుల ఇళ్లకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు.
మభ్య పెట్టేందుకే భారీ కేటాయింపులు: రాజయ్య
ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నా ఖర్చు చేయడం లేదని సీపీఎం పక్ష నేత సున్నం రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, వికలాంగులకు కేటాయింపుల్లో 70 శాతం నిధులు కూడా ఖర్చు కాకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు సబ్‌ప్లాన్ అవసరమన్నారు. గిరిజన ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. తక్షణమే మునిసిపల్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్ సీఎం అంతరంగాన్ని ఆవిష్కరించింది: చింత ప్రభాకర్
ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగాన్ని బడ్జెట్ ఆవిష్కరించిందని టీఆర్‌ఎస్ సభ్యుడు చింత ప్రభాకర్ పేర్కొన్నారు. మాకు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ముఖ్యం అనే రీతిలో బడ్జెట్ కేటాయింపులను జరిపారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను చూసి బడుగు, సబ్బండ వర్ణాలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.