సాక్షి, హైదరాబాద్: రాగల 24 గంటల్లో మాల్దీవులు, కోమోరిన్‌లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. దీని ప్రభావం వల్ల జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు.
మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇది మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. అలాగే రాగల 72 గంటల్లో ఇది వాయవ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితలద్రోణి కొనసాగుతోందని రాజారావు తెలిపారు.
వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు వెల్లడించారు. శుక్రవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment