సాక్షి, ఖమ్మం : గోదావరి పరీవాహక ప్రాంతాల ఆశలసౌధం రాజీవ్‌సాగర్ (దుమ్ముగూడెం) పనులకు గ్రహణం పట్టుకుంది. భూసేకరణకు అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో ఆర్నెల్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణ గడువు పూర్తయినా మరికొంత కాలం పెంచేందుకు పలు ప్యాకేజీలకు నేటికీ ఉత్తర్వులు రాలేదు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు 50 శాతం వరకే పూర్తయ్యాయి.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై స్పందించి అటవీశాఖ అనుమతులు ఇప్పిస్తేనే పనులు చకచక సాగనున్నాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా డిజైన్ చేశారు. అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తీసుకొని జిల్లాలోని 16 మండలాలు, వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలానికి సాగు నీరు అందించాలి. వర్షాధారం పైనే ఆధారపడి ఉన్న ఈ మెరక ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. 2007లో రూ.1681 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం మంజూరు
చేసింది.
అయితే సాంకేతికంగా ఈ ప్రాజెక్టుకు రూ.1247 కోట్లు కేటాయించినా రూ.831 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2012 నాటికి పూర్తి చేసి నిర్ధారిత ఆయకట్టుకు సాగు నీరు అందించాలి. కానీ గడువు దాటినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేక పోయారు.
అడ్డంకిగా మారిన భూసేకరణ
ఈ ప్రాజెక్టు కోసం వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 6,253 ఎకరాలు భూసేకరణ చేయాలి. ఏళ్లు గడిచినా కేవలం 805 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 5,448 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఈ పనులు అడుగు ముందుకు కదల్లేదు. ఇందులో సుమారు రెండువేల ఎకరాల వరకు అటవీ భూములు కాగా మిగతావి రైతులవి. అటవీ భూములకు సంబంధించి ప్రాజెక్టు అధికారులు అనుమతి కోసం నివేదికలు పంపినా క్లియరెన్స్ మాత్రం రాలేదు. అలాగే రైతులు తమ భూములకు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేయడంతో భూ సేకరణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రధానంగా అశ్వాపురం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో అటవీశాఖ భూములు ఉన్నాయి. అనుమతులు వస్తేనే ఇక్కడ పనులు జరిగేది.
గడువు పెంచని ప్రభుత్వం
2012తో ఈ ప్రాజెక్టు నిర్మాణ గడువు పూర్తి అయింది. గత ఏడాదే ఈ ప్రాజెక్టు గడువు పెంచాలని అప్పటి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని మొత్తం ఏడు ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్యాకేజీలన్నింటికీ 2016 వరకు గడువు కావాలని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దానిలో కొన్ని ప్యాకేజీలకే అనుమతి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అటవీశాఖ భూముల్లోనే ఈ ప్యాకేజీలున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అటవీశాఖ అనమతులు ఇప్పిస్తేనే.. ప్రాజెక్టు నిర్మాణం ఇంకా మూడేళ్లు పట్టనుంది.
జరిగిన పనుల్లోనూ కొరవడిన నాణ్యత
ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 50 శాతం పూర్తయినా ఈ పనుల్లో చాలా వరకు నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ప్రధానంగా పంపుహౌస్‌ల నిర్మాణంలో గోదావరి ఇసుకను వాడాలని కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి కాంట్రాక్టర్లు స్థానిక వాగుల్లోని మట్టితో కూడిన ఇసుకను పంపుహౌస్‌ల నిర్మాణానికి వాడారు. ఇలా చండ్రుగొండ ప్రాంతంలో నిర్మించిన ఓ పంపుహౌస్‌కు నాసిరకం ఇసుకను వాడినట్లు సమాచారం. కొన్నేళ్లపాటు నిర్మాణపరంగా దృఢంగా ఉండి నీటిని అందించాల్సిన పంపుహౌస్‌ల నాసిరకంగా నిర్మించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఎడతెగని ‘సాగర్’ఫారెస్ట్
Published Wed, Oct 8 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement