rajiv sagar project
-
‘దుమ్ము’ కొట్టుకుపోతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రెండు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. రాష్ట్ర విభజనతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను గాడినపెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్లుగా ఉండటంతో ప్రాజెక్టుల పనులు అతీగతీ లేకుండా లేకుండా పోయాయి. మొత్తంగా రూ.3 వేల కోట్ల పనులకు 50 శాతం మేర పనులు పూర్తి అయినప్పటికీ మిగతా పనులు మాత్రం ఏడాదిగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మిగిలాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన పనులు... గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలతోపాటు ఏపీలోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు నీరిచ్చేలా రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. ఇందులో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకు రూ.1,681 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వగా ఇప్పటివరకు 838.27 కోట్ల పనులు పూర్తయ్యాయి. గతేడాది సైతం ఈ ప్రాజెక్టుకు రూ.25 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు కేవలం రూ.లక్ష మాత్రమే ఖర్చయింది. ప్రాజెక్టు పరిధిలో కోల్పోతున్న 300 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమి చూపించాల్సి ఉండగా ఇంతరవకూ తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు కదలట్లేదు. ముందుకు రాని ఏపీ... ఇక ఇందిరాసాగ ర్తో ఖమ్మం జిల్లాలో 1.24 లక్షల ఎకరాలు, ఏపీలోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో మరో 76.20 వేల ఎకరాలకు నీరందించాలని సంల్పించారు. రాష్ట్ర విభజన కారణంగా ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని ఏపీకి వెళ్లడంతో ప్రాజెక్టు నిర్మాణ తదుపరి పనుల్లో స్తబ్దత ఏర్పడింది. ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయాన్ని రూ.1824కోట్లుగా నిర్ణయించగా అందులో ఇప్పటికే రూ.1,047కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా రూ.423.33కోట్ల పనులు జరగాల్సి ఉండగా రూ.126.35 కోట్ల పనులు జరిగాయి. ఏపీలో మరో రూ.296 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తెలంగాణలో రూ.318 కోట్ల వరకు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు లెక్కకట్టారు. ఈ లెక్కన మొత్తంగా మిగిలిన పనుల విలువ రూ.615 కోట్ల వరకు ఉండగా ఇరు రాష్ట్రాల పరిధిలోని ఆయకట్టు లెక్కన తెలంగాణ రూ.382 కోట్లు, ఏపీ రూ.233 కోట్ల మేర ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తేల్చారు. ఈ పనుల ఖర్చుకు సంబంధించి గతంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు ఏపీ అధికారులకు లేఖ రాయగా దీనిపై సమాధానం రాలేదు. ఇందిరాసాగర్ ఎత్తిపోతల మిగులు పనులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా పూర్తి చేసుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఆయకట్టు ప్రాతిపదికన ఖర్చును భరించేలా ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇంతవరకు ఇరు రాష్ట్రాల నుంచి అలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదు. రూ.10 కోట్లు కేటాయిస్తే.. ఖర్చు పెట్టింది రూ.10 వేలే! ప్రస్తుత ఏడాది బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు మొత్తంగా రూ.35 కోట్ల మేర కేటాయింపులు చేసింది. ఇందులో రాజీవ్‌సాగర్‌కు రూ.25 కోట్ల మేర కేటాయింపులు చేయగా ఇప్పటివరకు జరిగిన పనుల విలువ కేవలం 1.22 కోట్లుగా ఉంది. ఇక ఇందిరాసాగర్‌కు రూ.10 కోట్లు కేటాయించగా అందులో రూ.10 వేలు మాత్రమే ఖర్చయినట్లు నీటిపారుదలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. -
ఎడతెగని ‘సాగర్’ఫారెస్ట్
సాక్షి, ఖమ్మం : గోదావరి పరీవాహక ప్రాంతాల ఆశలసౌధం రాజీవ్‌సాగర్ (దుమ్ముగూడెం) పనులకు గ్రహణం పట్టుకుంది. భూసేకరణకు అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో ఆర్నెల్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణ గడువు పూర్తయినా మరికొంత కాలం పెంచేందుకు పలు ప్యాకేజీలకు నేటికీ ఉత్తర్వులు రాలేదు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు 50 శాతం వరకే పూర్తయ్యాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై స్పందించి అటవీశాఖ అనుమతులు ఇప్పిస్తేనే పనులు చకచక సాగనున్నాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా డిజైన్ చేశారు. అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తీసుకొని జిల్లాలోని 16 మండలాలు, వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలానికి సాగు నీరు అందించాలి. వర్షాధారం పైనే ఆధారపడి ఉన్న ఈ మెరక ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. 2007లో రూ.1681 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే సాంకేతికంగా ఈ ప్రాజెక్టుకు రూ.1247 కోట్లు కేటాయించినా రూ.831 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2012 నాటికి పూర్తి చేసి నిర్ధారిత ఆయకట్టుకు సాగు నీరు అందించాలి. కానీ గడువు దాటినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేక పోయారు. అడ్డంకిగా మారిన భూసేకరణ ఈ ప్రాజెక్టు కోసం వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 6,253 ఎకరాలు భూసేకరణ చేయాలి. ఏళ్లు గడిచినా కేవలం 805 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 5,448 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఈ పనులు అడుగు ముందుకు కదల్లేదు. ఇందులో సుమారు రెండువేల ఎకరాల వరకు అటవీ భూములు కాగా మిగతావి రైతులవి. అటవీ భూములకు సంబంధించి ప్రాజెక్టు అధికారులు అనుమతి కోసం నివేదికలు పంపినా క్లియరెన్స్ మాత్రం రాలేదు. అలాగే రైతులు తమ భూములకు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేయడంతో భూ సేకరణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రధానంగా అశ్వాపురం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో అటవీశాఖ భూములు ఉన్నాయి. అనుమతులు వస్తేనే ఇక్కడ పనులు జరిగేది. గడువు పెంచని ప్రభుత్వం 2012తో ఈ ప్రాజెక్టు నిర్మాణ గడువు పూర్తి అయింది. గత ఏడాదే ఈ ప్రాజెక్టు గడువు పెంచాలని అప్పటి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని మొత్తం ఏడు ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్యాకేజీలన్నింటికీ 2016 వరకు గడువు కావాలని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దానిలో కొన్ని ప్యాకేజీలకే అనుమతి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అటవీశాఖ భూముల్లోనే ఈ ప్యాకేజీలున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అటవీశాఖ అనమతులు ఇప్పిస్తేనే.. ప్రాజెక్టు నిర్మాణం ఇంకా మూడేళ్లు పట్టనుంది. జరిగిన పనుల్లోనూ కొరవడిన నాణ్యత ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 50 శాతం పూర్తయినా ఈ పనుల్లో చాలా వరకు నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ప్రధానంగా పంపుహౌస్‌ల నిర్మాణంలో గోదావరి ఇసుకను వాడాలని కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి కాంట్రాక్టర్లు స్థానిక వాగుల్లోని మట్టితో కూడిన ఇసుకను పంపుహౌస్‌ల నిర్మాణానికి వాడారు. ఇలా చండ్రుగొండ ప్రాంతంలో నిర్మించిన ఓ పంపుహౌస్‌కు నాసిరకం ఇసుకను వాడినట్లు సమాచారం. కొన్నేళ్లపాటు నిర్మాణపరంగా దృఢంగా ఉండి నీటిని అందించాల్సిన పంపుహౌస్‌ల నాసిరకంగా నిర్మించడంపై విమర్శలు వస్తున్నాయి.