‘దుమ్ము’ కొట్టుకుపోతున్నాయ్! | Joint State starts the works... | Sakshi
Sakshi News home page

‘దుమ్ము’ కొట్టుకుపోతున్నాయ్!

Published Mon, Aug 3 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

‘దుమ్ము’ కొట్టుకుపోతున్నాయ్!

‘దుమ్ము’ కొట్టుకుపోతున్నాయ్!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రెండు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. రాష్ట్ర విభజనతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను గాడినపెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్లుగా ఉండటంతో ప్రాజెక్టుల పనులు అతీగతీ లేకుండా లేకుండా పోయాయి. మొత్తంగా రూ.3 వేల కోట్ల పనులకు 50 శాతం మేర పనులు పూర్తి అయినప్పటికీ మిగతా పనులు మాత్రం ఏడాదిగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మిగిలాయి.
 
ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన పనులు...
గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలతోపాటు ఏపీలోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు నీరిచ్చేలా రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. ఇందులో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకు రూ.1,681 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వగా ఇప్పటివరకు 838.27 కోట్ల పనులు పూర్తయ్యాయి.

గతేడాది సైతం ఈ ప్రాజెక్టుకు రూ.25 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు కేవలం రూ.లక్ష మాత్రమే ఖర్చయింది. ప్రాజెక్టు పరిధిలో కోల్పోతున్న 300 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమి చూపించాల్సి ఉండగా ఇంతరవకూ తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు కదలట్లేదు.
 
ముందుకు రాని ఏపీ...
ఇక ఇందిరాసాగ ర్‌తో ఖమ్మం జిల్లాలో 1.24 లక్షల ఎకరాలు, ఏపీలోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో మరో 76.20 వేల ఎకరాలకు నీరందించాలని సంల్పించారు. రాష్ట్ర విభజన కారణంగా ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని ఏపీకి వెళ్లడంతో ప్రాజెక్టు నిర్మాణ తదుపరి పనుల్లో స్తబ్దత ఏర్పడింది. ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయాన్ని రూ.1824కోట్లుగా నిర్ణయించగా అందులో ఇప్పటికే రూ.1,047కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా రూ.423.33కోట్ల పనులు జరగాల్సి ఉండగా రూ.126.35 కోట్ల పనులు జరిగాయి. ఏపీలో మరో రూ.296 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇక తెలంగాణలో రూ.318 కోట్ల వరకు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు లెక్కకట్టారు. ఈ లెక్కన మొత్తంగా మిగిలిన పనుల విలువ రూ.615 కోట్ల వరకు ఉండగా ఇరు రాష్ట్రాల పరిధిలోని ఆయకట్టు లెక్కన తెలంగాణ రూ.382 కోట్లు, ఏపీ రూ.233 కోట్ల మేర ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తేల్చారు. ఈ పనుల ఖర్చుకు సంబంధించి గతంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు ఏపీ అధికారులకు లేఖ రాయగా దీనిపై సమాధానం రాలేదు.

ఇందిరాసాగర్ ఎత్తిపోతల మిగులు పనులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా పూర్తి చేసుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఆయకట్టు ప్రాతిపదికన ఖర్చును భరించేలా ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇంతవరకు ఇరు రాష్ట్రాల నుంచి అలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదు.
 
రూ.10 కోట్లు కేటాయిస్తే..
ఖర్చు పెట్టింది రూ.10 వేలే!
ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు మొత్తంగా రూ.35 కోట్ల మేర కేటాయింపులు చేసింది. ఇందులో రాజీవ్‌సాగర్‌కు రూ.25 కోట్ల మేర కేటాయింపులు చేయగా ఇప్పటివరకు జరిగిన పనుల విలువ కేవలం 1.22 కోట్లుగా ఉంది. ఇక ఇందిరాసాగర్‌కు రూ.10 కోట్లు కేటాయించగా అందులో రూ.10 వేలు మాత్రమే ఖర్చయినట్లు నీటిపారుదలశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement