రామగుండం కోల్‌బెల్ట్ ఏరియాలో 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇందుకు పార్టీలో ఏర్పడిన గ్రూపులు, వర్గాలే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1967లో మేడారం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గడిపెల్లి రాములు విజయం సాధించారు.
ఆ తర్వాత 1972, 1978లో జరిగిన ఎన్నికల్లో ఇదే పార్టీకి చెందిన పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అన్న కొడుకు ఈశ్వర్ గెలుపొందారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాతంగి నర్సయ్య విజయం సాధించారు. 1989లో మాతంగి నర్సయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్యంగా తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి ఎవరూ ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు.
స్వతంత్ర అభ్యర్థి మాలం మల్లేశం 1994లో, టీడీపీ నుంచి మాతంగి నర్సయ్య 1999లో, టీఆర్‌ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ 2004లో, స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ 2009లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి పునర్విభజనలో రామగుండం జనరల్ నియోకవర్గంగా మార్పు చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలువలేకపోయింది. పార్టీలో ఉన్న గ్రూపులు, వర్గాలే ‘చేతి’కి అధికారం రాకుండా చేశాయనేది సుస్పష్టం కాగా, ఆ విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. 1994లో కాంగ్రెస్ తరఫున బడికెల రాజలింగం పోటీ చేయగా, ఓటర్లు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచిన మాలెం మల్లేశాన్ని ఎన్నుకున్నారు.
రాజలింగాన్ని సొంతపార్టీ వారే ఓడించారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వగా ఆయన చిన్నవాడనే ఉద్దేశంతో పార్టీ పెద్దలే ఓడించారని చెబుతారు. 2004లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తులో భాగంగా ఇక్కడి సీటును టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ పదవికి రాజీనామా చేయడంతో 2008లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌ను గుమ్మడి కుమారస్వామికి ఇచ్చారు. టీఆర్‌ఎస్ గాలి వీయడంతో పాటు గుమ్మడికి కాంగ్రెస్ పెద్దల నుంచి సహకారం అందకపోవడంతో ఆయన ఓటమిపాలయ్యారు.
2009లో మేడారం పునర్విభజనలో రామగుండం జనరల్‌గా మార్పు చేయగా ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ బాబర్ సలీంపాషాకు ఇచ్చారు. ఎన్టీపీసీకి చెందిన బాబర్‌కు సింగరేణికి చెందిన పార్టీ, యూనియన్ శ్రేణులు సహకారం అందించకపోవడంతోనే ఆయన ఓడిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా వేచి చూడాల్సిందే.
‘చేతి’కి రాని కోల్‌బెల్ట్
Published Fri, Apr 4 2014 4:18 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement