
దేశంలోనే భాగ్యనగరంలో రంజాన్ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ముస్లింలు ప్రతి ఏటా ఈ పండుగను నెల రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. దీనికి తగ్గట్లుగానే రంజాన్ మార్కెట్ భారీగా ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో దాదాపురూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా చరిత్రలోనే తొలిసారిగా రంజాన్ మార్కెట్ స్తంభించింది. ఇఫ్తార్ విందులు, వస్త్రాలు, హోటళ్లు, అత్తరు పరిమళాలు, లాడ్‌బజార్ గాజుల గలగలలు ఇక లేనట్లే. మొత్తానికి గ్రేటర్‌లో లాక్‌డౌన్ కారణంగా రంజాన్ సందడికి బ్రేక్ పడినట్లే.
చార్మినార్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఈసారి రంజాన్ మార్కెట్‌కు అవకాశాలు లేవు. మార్కెట్లన్నీ బోసిపోయి కనిపించనున్నాయి. రంజాన్ మాసంలో సాధారణంగా అన్ని రకాల వ్యాపారాలు కలిసి దాదాపు 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ బిజనెస్ అంతా ఈ సంవత్సరం లాస్ అయినట్లే. పాతబస్తీలోని పటేల్ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్‌గంజ్, ఘాన్సీబజార్, చార్‌కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్‌గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలన్నీ దెబ్బతిననున్నాయి. రంజాన్ మార్కెట్‌లో ప్రతి ఏడాది వస్త్ర వ్యాపారాలు 3 వేల కోట్ల రూపాయలు జరుగుతాయని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ,
శంషీర్‌గంజ్ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోనున్నాయి.
జానిమాజ్ మార్కెట్‌కు బ్రేక్...
ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యంలో ఉన్న జానిమాజ్‌లను పాతబస్తీ మదీనా సర్కిల్‌లోని మహ్మద్ క్యాప్ మార్ట్ (ఎంసీఎం) ఒకే వేదికపైకి తీసుకు వచ్చి నెల రోజుల పాటు కొనసాగే అంతర్జాతీయ జానిమాజ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతోంది. అయితే ఈసారి జానీమాజ్‌ల మార్కెట్‌పై కరోనా ప్రభావం పడింది. లక్షలాది రూపాలయల వ్యాపారం దెబ్బతింటోంది. దీంతో పాటు కుర్తా, ఫైజామా, టోపీలను కూడా మార్కెట్‌లలో అందుబాటులో ఉండేవి. ఇవేవీ ఈసారి రంజాన్ మాసంలో కనిపించవు.
సేమియా మార్కెట్‌కు కష్టకాలం
నిజానికి రంజాన్ మాసానికి రెండు నెలలకు ముందు నుంచే సేమియాల తయారీ కొనసాగుతుంది. గత నెల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో సేమియా తయారీకి అవసరమైన ముడిసరుకు లభించకపోవడంతో సేమియా తయారీ నిలిచిపోయింది. ఈసారి రంజాన్ పండుగకు సేమియా మరింత డిమాండ్ అయ్యే పరిస్థితులున్నాయి.
మక్కా మసీదుకు రావద్దు...
కరోనా ప్రభావంతో పాటు లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రంజాన్ మాసంలో ఎవరూ మక్కా మసీదుకు రావద్దు. సహర్, ఇఫ్తార్, తరావీలతో పాటు జుమ్మాకీ నమాజ్‌లను ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి. ఇప్పటికే మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. – మహ్మద్ అబ్దుల్ ఖాధర్ సిద్దికీ,మక్కా మసీదు సూపరింటెండెంట్
అత్తర్ గుబాళింపులు ..ప్రశ్నార్థకం
మార్కెట్‌లో అత్తర్ సువాసనల గుబాళింపులు తక్కువగా ఉండబోతున్నాయి. ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్తర్‌తోనే సర్దుకోనున్నారు. గులాబి రేకులు, మల్లెపువ్వులు, మొగలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్ కావాలో దానిని ప్రత్యేకంగా తయారుచేసిన బట్టీలలోని డెకీసాలలో వేస్తారు. డేకీసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలుసిసలు ‘ అత్తర్’. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నోజ్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. తెలంగాణతో పాటు అసోం, కంబోడియాలలో కూడా దీని తయారీ కేంద్రాలున్నాయి.
సుర్మా విక్రయాలుండవు..
రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ప్రతిరోజూ రెండు కళ్లకు ఈ సుర్మాను పెట్టుకుంటారు. ప్రవక్త మూసా అలైహి సలాం సుర్మాను వాడారు కాబట్టి ముస్లిం సోదరులు దీనిని సున్నత్‌గా భావించి రంజాన్ మాసంలో వాడుతున్నారు. జీవిత కాలంలో కనీసం ఒక తులం సుర్మాను తప్పని సరిగా వాడాల్సి ఉంటుందని..అందుకే రంజాన్ మాసంలో సుర్మా వినియోగం ఎక్కువగా ఉంటుందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు.
పటేల్ మార్కెట్‌కు పని లేదు..
చీరల హోల్‌సేల్ (టెక్స్‌టైల్స్) మార్కెట్‌కు కేంద్ర బిందువైన పాతబస్తీలోని పటేల్ మార్కెట్‌లో సాధారణంగా ప్రతి రంజాన్ మాసంలో సందడి నెలకొంటుంది. లాక్‌డౌన్ కారణంగా ఈ రంజాన్ మాసంలో వస్త్ర దుకాణాలు తెరుచుకునే పరిస్థితులు లేవు. దాదాపు 2 వేల వరకు ఇక్కడ దుకాణాలున్నాయి. దాదాపు 50 టెక్స్‌టైల్స్ ఫ్యాక్టరీల అనుబంద వ్యాపారాలు కొనసాగుతాయి.
ఉపాధి కోల్పోతున్న టైలర్లు..
రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం తప్పనిసరిగా నూతన దుస్తులను ధరించడం ఆనవాయితీ. ఇందుకోసం రంజాన్‌లో పెద్ద ఎత్తున షాపింగ్ చేసి దుస్తులను ఖరీదు చేసి తమ దగ్గర్లోని టైలర్లకు అందజేస్తారు. ఈసారి లాక్‌డౌన్ కొనసాగుతున్న రోజుల్లో రంజాన్ మాసం రావడంతో టైలర్లు సైతం ఉపాధి కోల్పోతున్నారు.
లాడ్‌బజార్ గాజులంటే ఇష్టం..
రంజాన్‌లో తప్పనిసరిగా గాజులు ఖరీదు చేయడం నాకు అలవాటు. నేనే కాదు..మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడి నుంచే ఇష్టమైన గాజులను ఖరీదు చేస్తాం. అందరం కలిసి రాత్రిపూట లాడ్‌బజర్‌కు వచ్చి ఎంతో ఇష్టంగా షాపింగ్ చేసేవాళ్లం. ఈ సారి లాక్‌డౌన్ మమల్ని నిరాశపరుస్తోంది.– మషరత్ ఫాతిమా, గృహిణి, చార్మినార్
తీవ్రంగా నష్టపోతున్నాం..
రంజాన్ మాసం సందర్బంగా కుర్తా, పైజామా, లాల్చీ, టోపీలు, జానీమాజ్‌ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఈసారి లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో రంజాన్ మార్కెట్ నడిచే అవకాశాలు లేవు. మేం తీవ్రంగా నష్టపోవాల్సిందే. సరుకు రవాణా సామాజిక దూరం అంశంతో సమస్యలు తలెత్తుతాయి. – మహ్మద్ ఇలియాస్ బుకారీ, వ్యాపారి.
Comments
Please login to add a commentAdd a comment