
ఇదంతా... దుష్ర్పచారం
నల్లగొండ : కొనపురి రాములు హత్యకేసుకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని, ఉద్దేశపూర్వకంగానే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై దుష్ర్పచారం చేస్తున్నాడని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి ఆరోపించారు. నల్లగొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ నాపై రెండు, మూడు రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారం వెనుక ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఉన్నాడు. మీడియాతో ఒక ప్యాకేజీ మాట్లాడుకుని చేస్తున్న ప్రచారం.
హత్యకు సంబంధించి నా పాత్ర ఉంటే కచ్చితంగా శిక్షార్హుడుని. దీనికి బాధ్యత వహిస్తా. రాములు వంటి మంచి మిత్రుడిని కోల్పోయా. మా అందరి దురదృష్టకరం. సంబంధం లేని అంశాలు మాకు అంటగడుతున్నారు. కేసులో నాప్రమేయం ఉంటే పోలీసులు నిర్ధారించాలి. లేదంటే రాములు కుటుంబ సభ్యులు నాపై ఆరోపణలు చేస్తే దానికి నేను బాధ్యత వహిస్తా. ఫిర్యాదులు లేకుండా నాపై దుష్ర్పచారం చేస్తున్నారు...’’ అని దుబ్బాక పేర్కొన్నారు. రాములు కుటుంబ సభ్యులు ఆయన డెత్ సర్టిఫికెట్ ఇప్పించే బాధ్యత కూడా తనకే అప్పగించారని తెలిపారు.
ఈ విషయాన్ని రాములు కుటుంబ సభ్యులు మీడియా ముం దుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదన్నారు. పోలీసులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారని, తన అభిప్రాయాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదులు, పోలీసుల అభిప్రాయం లేకుండా దుష్ర్పచారం చేస్తున్నారని వాపోయారు. రాములు కుటుంబానికి అండగా ఉంటామని, తనపై నింది తుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీ సులు విచారించారని, ఎస్పీ కూడా తనకు కేసుతో సంబంధం లేదని చెప్పాడని దుబ్బాక పేర్కొన్నారు.