సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఒక శిల్పాన్ని ఒకే రాయిపై చెక్కుతారు. కానీ ఒకే శిల్పాన్ని చిన్న రాళ్లపై భాగాలుగా చెక్కి.. ఇటుకల మాదిరిగా పేర్చి పూర్తి రూపం ఇవ్వటం మాత్రం అరుదే. కాంబోడియా దేశంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత అంగ్‌కోర్‌వాట్ ఆలయంలో శిల్పాలను ఇలాగే రూపుదిద్దారు. ఇండోనేసియా సెంట్రల్ జావాలోని బోరోబుదూర్ దేవాలయం కూడా ఈ తరహా నిర్మాణ కౌశలానికి ప్రతీక. మరి అలాంటి ప్రత్యేకత ఉన్న పురాతన నిర్మాణం మన తెలంగాణలోనూ ఉంది.
ఆరు అడుగుల ఎత్తు.. దాదాపు 20 దాకా ఇసుకరాతి ఇటుకలు.. ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం.. అన్నీ కలిస్తే.. అజంతా చిత్రాల్లోని పద్మఫాణిని పోలిన బోధిసత్వుడు రాచకొలువులో లలితాసనంలో కూర్చున్న దృశ్యం ఆవిష్కృతం.. బుద్ధుడి జీవిత గాథలతో కూడిన ఇలాంటి ఎన్నో చిత్రాలను ఆ రాళ్లు కళ్లకు కడతాయి. చూడగానే అంగ్‌కోర్‌వాట్ ఆలయ గోడలను మరిపించే ఈ మందిరం.. అంగ్‌కోర్‌వాట్ ఆలయం కంటే దాదాపు ఐదొందల ఏళ్లకు ముందుది.
ఆ మహా నిర్మాణంతో పోలిస్తే రూపులో చాలా చిన్నదే అయినా, నిర్మాణ కౌశలం పరంగా దానికి అమ్మలాంటిదే. ఇంతకూ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో దేవునిగుట్టపై ఠీవిగా నిలిచి ఉంది. ఇలాంటి అద్భుత దేవాలయం ఒకటి ఇక్కడ ఉందనే సంగతి స్థానికులకు మినహా ఐదారు నెలల క్రితం వరకూ బాహ్య ప్రపంచానికి తెలియదు. పురావస్తుశాఖ కూడా దాన్ని ఇంతవరకు గుర్తించలేదు.
వజ్రయాన ప్రభావమే..?
బౌద్ధానికి చివరిదశ వజ్రయానం. తాంత్రిక బౌద్ధమని, మంత్రయానమనీ పిలిచే ఈ విధానం తెలంగాణలోని నాగార్జున కొండ నుంచి మొదలై ఇతర దేశాలకు విస్తరించిందంటారు. కాంబోడియా సహా ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచే వ్యాపించినందున, ఆదిలో ఇక్కడ ఆ తరహా ఆలయం నిర్మితమై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేవునిగుట్టపై నుంచే రాతిని తొలిచి దాన్ని ఇటుకలుగా మార్చి ఆలయాన్ని నిర్మించారు. ఇసుకరాయి అంత పటుత్వంగా ఉండదు. కొనలు సులభంగా రాలిపోతాయి. అందుకనే వాటిని చిన్న ఇటుకలుగా మార్చి, అనుకున్న శిల్పాకృతిని భాగాలుగా వాటిపై ముందు చెక్కి ఆ తర్వాత వరసగా పేర్చారు. అందులోని విగ్రహాలు మాత్రం మాయం కావటంతో ఇటీవల స్థానికులు దాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా మార్చుకుని కాముని పున్నమి సమయంలో జాతర నిర్వహిస్తున్నారు.
శతాబ్దాల క్రమంలో మార్పులు..
నలువైపులా అర్ధపద్మాలు, సింహాల బొమ్మలు చెక్కిన పాలరాతి బౌద్ధ ఆయకస్తంభం ఉండటాన్ని బట్టి ఒకటి లేదా రెండో శతాబ్దంలో ఇది బౌద్ధ స్థావరంగా ఉండేదని వారు పేర్కొంటున్నారు. వందల ఏళ్ల పరిణామక్రమంలో ఇది బౌద్ధ చైత్యాలయంగా మారి ఉంటుందని భావిస్తున్నారు. గర్భాలయం, దాని ముందు ప్రహరీ మాత్రమే ఉంది. ప్రవేశద్వారం ఎత్తు తక్కువగా ఉంది. లోనికి వెళ్తే.. గోడల్లోని రాతి ఇటుకలపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలెన్నో ఉన్నాయి.
బౌద్ధంలోని వజ్రయానంలో బుద్ధుడిని పరమశివుడి రూపంలోనూ పూజించే పద్ధతి ఉన్నందున, ఈ ఆలయ గోడలపై అర్ధనారేశ్వర శిల్పం కూడా కనిపిస్తుండటం విశేషం. భయంకరంగా ఉన్న పెద్ద తల కలిగిన బోధిసత్వుడు(జాంభాలుడి రూపం అయి ఉంటుంది) ఎడమకాలితో మరో వ్యక్తిని వంచి ఎడమ చేతితో ఆతని మెడను వెనక్కి విరిచి పట్టుకున్న మరో దృశ్యం ఉంది. అంగ్‌కోర్‌వాట్‌లో పెద్ద రూపంలో ఉన్న అమితాభుని శిరస్సు రూపం ఇక్కడ చిన్న రాతిపై కనిపిస్తోంది.
అన్నీ ఇసుక రాతి ఇటుకలే..
కాకతీయులు.. కళ్యాణ చాళుక్యుల కాలం.. వారి వారి నిర్మాణశైలిలో తెలంగాణలో ఎన్నో అద్భుత ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. కానీ.. ఈ ఆలయం మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఇప్పటి వరకూ మనం చూడని శైలి. అడుగు నుంచి నాలుగు అడుగుల మేర ఉన్న ఇసుక రాతి ఇటుకలను పేర్చి దీన్ని నిర్మించారు. రాళ్లను డంగు సున్నం మిశ్రమంతో జోడించారు. ప్రస్తుతం ఆ మందిరం ఎత్తు 24 అడుగుల వరకు ఉంది.
దానిపైన శిఖరం కూడా గతంలో ఉండేదనటానికి నిదర్శనాలున్నాయి. పునాదులు లేకుండా తొమ్మిది అడుగుల మందంతో రాతి ఇటుకలతో నిర్మించారు. మధ్యలో ఖాళీ ఉండి రెండు పొరలతో నిర్మితమై ఆ గోడ వెలుపల, లోపల రాళ్లపై శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇటీవల ఆలయం విషయం తెలిసి ‘సాక్షి’ దాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది.
అప్పటికే ఆ బృందం కూడా దీని సమాచారం తెలిసి అన్వేషణలో ఉంది. తాజాగా ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలో వేముగంటి మురళి, కట్టా శ్రీనివాస్, అరవింద్, సదానందం, సమీర్, కరుణాకర్, మహేశ్, చంటి, కొత్తూరు గ్రామ సర్పంచ్ రవీందర్‌రావు తదితరులు దీన్ని పరిశీలించి విశ్లేషించారు.
కదిలిపోతున్న రాళ్లు..
కనీస నిర్వహణ లేకపోవటంతో ఈ అతిపురాతన ఆలయం చెదిరిపోతోంది. రాళ్లు కదిలిపోతూ శిల్పాల రూపం దెబ్బతింటోంది. లోపలివైపు నుంచి చూస్తే ఆలయ శిఖరం మొనదేలిన పిరమిడ్ తరహాలో కనిపిస్తోంది. కానీ పై మొన భాగం లేదు. అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి వాననీరు లోనికి వస్తోంది.
అంటే శిక్షర భాగం దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. అతి అరుదైననిర్మాణ శైలితో రూపొందిన ఈ పురాతన మందిరాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది శిథిలమైతే ఇక ఈ తరహా నిర్మాణం అంతరించినట్టే. గుట్టపైకి రహదారి ఏర్పాటు చేసి ఆలయాన్ని పునరుద్ధరిస్తే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment