సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా అన్ని పక్షాలు, సభ్యులు సహకరించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, హైదరాబాద్: సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా అన్ని పక్షాలు, సభ్యులు సహకరించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. హుందాగా అసెంబ్లీని నడుపుకొని ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా చూడాలన్నారు. రైతులు, విద్యుత్ సమస్యలతో సహా అన్ని అంశాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తమకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టంచేశారు. తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచుకునేలా ప్రతిపక్ష సభ్యులు హుందాగా చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రతిపక్షాలు ఇచ్చే విలువైన సలహాలు, సూచనలను స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి రోడ్డు కోసమో, ప్రాజెక్టు కోసమో ఆశగా ఎదురుచూసి, దండాలు, దరఖాస్తులు పెట్టుకునే స్థితి నుంచి రూ. లక్ష కోట్లతో సొంతంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు బడ్జెట్ పెట్టుకోనుండడం సంతోషంగా ఉందన్నారు.
పదేళ్లపాటు ఏపీ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి, సమస్యలపై నిలదీసి, సీఎం, మంత్రులతో అవహేళనలకు, అవమానాలకు గురై.. ఇప్పుడు అదే అసెంబ్లీలో బడ్జెట్‌ను పెట్టుకోవడం తనకెంతో ఉద్విగ్నంగా ఉందని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే ఉచ్ఛరించకుండా ఒక నాయకుడు నిషేధిస్తే, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అని మరో నాయకుడు బెదిరించిన పరిస్థితి నుంచి.. సొంతంగా బడ్జెట్ పెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎప్పుడూ సభ జరగకుండా వాయిదాలు వేసుకుని తప్పించుకుని పోయే పరిస్థితి నుంచి శనివారంతోపాటు, సాయంత్రాలూ సమస్యలపై చర్చించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రభుత్వానికి-విపక్షాలకు తాను సంధానకర్తగా వ్యవహరిస్తానని, విపక్ష నాయకుల చాంబర్‌కు కూడా వెళ్లి చర్చించేందుకు సిద్ధమన్నారు.
రైతులకు ధైర్యమిచ్చేలా..
విద్యుత్ సమస్య, రైతుల ఆత్మహత్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కరెంట్ సమస్యకు మూలకారణం? ఎవరు, తెలంగాణలో ఈ సమస్య ఎందుకు వచ్చింది అన్న దానిపై కూడా చర్చిస్తామని హరీశ్‌రావు అన్నారు. మన రైతుల ప్రాణాలకు భరోసానిచ్చి, వారికి ైధె ర్యం నూరిపోసేలా అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు.
పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే..
రాజకీయ ఆరోపణలు చేసి, ఏదో ఒక విధంగా బురదజల్లి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే తగిన విధంగా వ్యవహరిస్తామని హరీశ్ చెప్పారు. కేటాయించిన సమయానికి లోబడి సభ్యులు మాట్లాడితే మంచిదని, దీన్ని కూడా రాజకీయం చేస్తే ఇతర సభ్యులకు అవకాశం రాదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఒకటి, రెండుపార్టీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా పక్క రాష్ట్రం కోసం, అక్కడి నాయకుల కోసమే పనిచేస్తే వారిని చరిత్ర క్షమించదన్నారు.
కార్యక్రమాలపై నేటీ బీఏసీలో నిర్ణయం
ఈ సమావేశాల్లో భాగంగా ఎన్నిరోజులు సభ ఉంటుంది, 304 నిబంధన, షార్ట్ డిస్కషన్, తదితర అంశాల చర్చపై ఎజెండాను బుధవారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్‌ను సమర్పించాక బీఏసీ భేటీలో నిర్ణయిస్తామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతి ప్రశ్నపై చర్చించేలా చూస్తామన్నారు. జీరో అవర్, పిటిషన్ అవర్, ఇలా అన్ని అంశాలపై చర్చ జరగాలని సీఎం కోరుకుంటున్నారన్నారు. పద్దుల వారీగా చర్చ జరుగుతుందన్నారు.
ఏ-టీమ్, బీ-టీమ్‌గా మంత్రుల విభజన
శాసనసభ, శాసనమండలి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా మంత్రులను ఏ, బీ బృందాలుగా విభజంచామని, వారు రొటేషన్ పద్ధతిలో పాల్గొంటారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, శాసనమండలిలో డిప్యూటీ సీఎం టి.రాజయ్య ప్రవేశపెడతారని ఆయన తెలిపారు.