చేతికి షాక్ | rebels not accept for withdrawal of nominations | Sakshi
Sakshi News home page

చేతికి షాక్

Published Sat, Apr 12 2014 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

rebels not accept for withdrawal of nominations

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడం అధిష్టానానికి సవాలుగా మారింది. అవకాశం కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన పలువురు టికెట్ చేజారడంతో రెబల్స్‌గా మారిపోయారు. అసమ్మతితో పార్టీకి నష్టం చేసే స్థితిలో ఉన్నారు. ఎక్కడెక్కడ రెబల్స్ ఉన్నారు, ఏయే నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నారన్న జాబితాను టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ మేరకు వారిని సముదాయించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఫోన్‌లు చేశారు.

 జిల్లాకు వచ్చేసరికి..
 బాన్సువాడ కాంగ్రెస్ టికెట్టును కాసుల బాల్‌రాజ్‌కు కేటాయించడంతో అసంతృప్తితో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగెం శ్రీనివాస్ గౌడ్, మాసాని శ్రీనివాస్ రెడ్డిలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధినాయకులు రంగంలో దిగారు. ఈ మేర కు మాసాని శ్రీనివాస్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య, కేంద్రమంత్రి జైరాం రమేశ్ ఫోన్‌చేసి హైదరాబాద్‌కు పిలిపించారు. కాంగ్రెస్‌లో సీని యర్ నాయకులను విస్మరించేది లేదని, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తప్పకుండా సీనియర్ నాయకులకు అధికార పదవులు ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే సంగెం శ్రీనివాస్‌గౌడ్‌ను పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ బుజ్జగించినట్లు తెలిసింది. నామినేషన్లను ఉపసంహరించాలని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరినట్లు తెలిసింది.

ఎల్లారెడ్డి కాం గ్రెస్ అభ్యర్థిగా నల్లమడుగు సురేందర్‌కు టికెట్ దక్కడంపై మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ తీవ్ర అసంతృప్తిలో ఉండగా, వారిని దిగ్విజయ్‌సింగ్ ఫోన్‌లో సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ససేమిరా అన్న వారు తమ అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. ఆ ఇద్దరితో పాటు ఎన్‌డీసీసీబీ డెరైక్టర్ సంపత్, ఏఎంసీ చైర్మన్ కృష్ణగౌడ్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు పార్టీని వీడటం కాంగ్రెస్‌కు పెద్దదెబ్బగా తగిలినట్లయ్యింది. ఓ వైపు అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు నేతలు రాజీనామాలకు సిద్ధమవుతుండటం కాంగ్రెస్ నాయకులను కలవరానికి గురిచేస్తోంది.

 డీసీసీ అధ్యక్షుడికి దిగ్విజయ్ ఫోన్...
 డీసీస అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించిన తాహెర్‌బిన్ హందాన్‌తో దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంకు రెబల్‌గా నామినేషన్ వేసిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతారకు కూడా ఆయన ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే ఆమె నామినేషన్ ఉపసంహరణకు ససేమిరా అన్నట్లు తెలిసింది. మూడు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న మైనార్టీ నేతగా తాహెర్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనను నారాజ్ కావద్దని దిగ్విజయ్ సూచించినట్లు తెలిసింది.

గతంలో నిజామాబాద్, బోధన్‌ల నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన తాహెర్‌కు, ఈసారి టికెట్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యాడన్న సమాచారం మేరకు దిగ్విజయ్ ఆయనతో మాట్లాడినట్లు తెలిసింది. ఈనెల 16న కరీంనగర్‌కు వచ్చి తనను కలవాలని సూచిం చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఆశించిన ప్రతి ఒక్కరి టికెట్ రావడం కష్టమని, అయితే పార్టీ సీనియర్లకు ఏదో ఒక తరహాలో పదవులిచ్చి గుర్తింపునిస్తుందని పేర్కొనట్లు సమాచారం. దిగ్విజయ్‌సింగ్ తనతో ఫోన్‌లో మాట్లాడింది నిజమేనని,టికెట్ రాకపోవడం మైనార్టీ నేతగా బాధ కలిగించిన మాట వాస్తవమేనని తాహెర్ అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తానని, 16న కరీంనగర్‌కు వెళ్లి దిగ్విజయ్‌ను కలుస్తానని ‘సాక్షి’కి ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement