తెలంగాణ ఉద్యమ సంకెళ్లు తెగిపోనున్నాయి.
వికారాబాద్: తెలంగాణ ఉద్యమ సంకెళ్లు తెగిపోనున్నాయి. 2001 నుంచి ఇప్పటివరకూ తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని హోం శాఖను ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ బుధవారం కేబినేట్ భేటీలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమకారులకు విముక్తి కలగనుంది.
ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురు తెలంగాణవాదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కేసులను మోపిన సంగతి విధితమే. అయితే కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమకారులపై పెట్టిన అన్ని కేసులను ఎత్తివేయించే బాధ్యత తనదేనని కేసీఆర్ అప్పట్లోనే అనేక సమావేశాల్లో పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు.
సంతోషంగా ఉంది
కేసుల ఎత్తివేత సంతోషకరం. ఉద్యమకారులకు కూడా స్వాతంత్య్ర సమరయోధుల్లాగా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థి నాయకుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం విషయంలో వయోపరిమితి మించి ఉంటే, వారికి వయసు మినహాయింపు ఇవ్వాలి. కేసుల కారణంగా విద్యకు దూరమైనవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి. కేసీఆర్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. - మహేందర్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు
ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి
త్యాగానికి ఫలితం దక్కింది. తెలంగాణ చిరకాల వాంఛ నెరవేరింది. ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపునివ్వాలి. రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లో అవకాశాలివ్వాలి. -బాల్‌రాజ్‌నాయక్, విద్యార్థి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి