అద్దె వాహనాల్లో పశువుల చోరీలు
ఇద్దరు నిందితుల అరెస్టు
రూ.2.2 లక్షలు, ఓ వాహనం స్వాధీనం
మేడ్చల్: పశువుల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చాంద్రాయన్‌గుట్టకు చెందిన మహ ్మద్ హస్మత్(24), రాజేంద్రనగర్ డివిజన్ మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేర్‌ఖాన్(24) వృత్తిరీత్యా డ్రైవర్లు. కొంతకాలంగా వీరు చాంద్రాయన్‌గుట్ట ప్రాంతంలో డీసీఎం వాహనాలను అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో పశువుల చోరీలకు పాల్పడుతున్నారు. దొంగిలించిన పశువులను నగరానికి తీసుకెళ్లి కబేళాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గత రెండు నెలల్లో మేడ్చల్ పట్టణంతో పాటు మండల పరిధిలోని శ్రీరంగవరం, గౌడవెళ్లి, రాయిలాపూర్‌లో పశువులను అపహరించుకుపోయారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. స్థానిక క్రైం పార్టీ పోలీసులు రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసుల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం సాయంత్రం విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మండల పరిధిలోని డబీల్‌పూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేశారు.
టాటా వింగర్(ఏపీ 29 టీబీ 5301)వాహనంలో వెళ్తున్న హస్మత్, షేర్‌ఖాన్ మేడ్చల్ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో తమదైన శైలిలో విచారణ జరుపగా పశువుల చోరీల విషయం తెలిపారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగుసార్లు, దుండిగల్, కేపీహెచ్‌బీ, పహాడీషరీఫ్, మేడిపల్లి ప్రాంతాల్లో పశువులను అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. వీరి గ్యాంగ్‌లోని మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షలు, టాటా వింగర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి వివరించారు. అనంతరం నిందితులను రిమాండుకు తరలించినట్లు ఆయన తెలియజేశారు.