Rental vehicles
-
ట్రా‘వెల్’ బిజినెస్!
* ప్రచారంలో రోజుకు వేల సంఖ్యలో అద్దె వాహనాలు * గత వారం రోజులుగా భారీగా పెరిగిన వినియోగం సాక్షి, సిటీబ్యూరో: ఇంటిల్లిపాదీ కలసి ఇన్నోవా, టవేరా వంటి వాహనాలను అద్దెకు తీసుకొని తిరుమలేశుని దర్శనానికో... బంధువుల ఇళ్లకో వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు ఓపిక పట్టాల్సిందే. అవును... ప్రస్తుతం నగరంలోని అద్దె వాహనాలన్నీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు వాహనాలు సమకూర్చడంలో ట్రావెల్స్ కంపెనీలు బిజీబిజీగా ఉన్నాయి. గత వారం రోజులుగా నగరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచార రథాలు, అభ్యర్థుల పర్యటనలకు వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఇండికా వంటి చిన్నవి మొదలుకొని.. క్వాలిస్, స్విఫ్ట్‌డిజైర్, ఫార్చునర్, ఎర్టిగా, గ్జైలో తదితర వాహనాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ట్రావె ల్స్ కంపెనీల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో ట్రావెల్స్ కంపెనీలు సైతం బాగానే డిమాండ్ చేస్తున్నాయి. వాహనం సామర్థ్యాన్ని బట్టి రోజుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నాయి. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 100కు పైగా ట్రావెల్స్ కంపెనీలకు ఎన్నికల కాలం బాగా కలసి వస్తోంది. నగరంలో ప్రస్తుతం 1,333 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు నిత్యం 10 వేల వరకు వాహనాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి నాయకులు, కార్యకర్తలను బస్తీలకు, కాలనీలకు తరలించడంలోనూ, ముఖ్యమైన నాయకుల రోడ్‌షోలకు వాహనాల వినియోగం తప్పనిసరి కావడంతో చాలా మంది అభ్యర్థులు సగటున 5 నుంచి 10 వాహనాలు అద్దెకు తీసుకుంటున్నారు. నగరంలోని ట్రావెల్స్‌కు డిమాండ్ ఉండడంతో వరంగల్, నల్లగొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల నుంచీ వాహనాలను తీసుకొస్తున్నారు. ఆటోలకూ గిరాకీ... చిన్న చిన్న బస్తీలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఆటోలను వినియోగిస్తున్నా రు. దీంతో వీటికీ డిమాండ్ పెరిగింది. పార్టీ బ్యానర్లు, అభ్యర్థుల నిలువెత్తు చిత్రాలు, ప్రచార సామగ్రి, మైక్సెట్లతో హోరెత్తించే ఆటోరిక్షాలు నగరంలో విరివిగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఐదారు వేలకు పైగా ఆటోలు ప్రచార రథాల అవతారమెత్తాయి. వీటికి ఏ రోజుకు ఆ రోజు వారు తిరిగిన దూరం మేరకు రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లిస్తున్నారు. ‘అధికార’ ఒత్తిడి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల కోసం తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు కొన్ని ట్రావెల్స్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అతి కష్టంగా వాహనాలను సమకూర్చినప్పటికీ డబ్బులు చెల్లించడం లేదని కొందరు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సి వస్తోందని... ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. -
అద్దె వాహనాల్లో పశువుల చోరీలు
ఇద్దరు నిందితుల అరెస్టు రూ.2.2 లక్షలు, ఓ వాహనం స్వాధీనం మేడ్చల్: పశువుల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చాంద్రాయన్గుట్టకు చెందిన మహ ్మద్ హస్మత్(24), రాజేంద్రనగర్ డివిజన్ మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేర్‌ఖాన్(24) వృత్తిరీత్యా డ్రైవర్లు. కొంతకాలంగా వీరు చాంద్రాయన్‌గుట్ట ప్రాంతంలో డీసీఎం వాహనాలను అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో పశువుల చోరీలకు పాల్పడుతున్నారు. దొంగిలించిన పశువులను నగరానికి తీసుకెళ్లి కబేళాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లో మేడ్చల్ పట్టణంతో పాటు మండల పరిధిలోని శ్రీరంగవరం, గౌడవెళ్లి, రాయిలాపూర్‌లో పశువులను అపహరించుకుపోయారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. స్థానిక క్రైం పార్టీ పోలీసులు రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసుల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం సాయంత్రం విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మండల పరిధిలోని డబీల్‌పూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేశారు. టాటా వింగర్(ఏపీ 29 టీబీ 5301)వాహనంలో వెళ్తున్న హస్మత్, షేర్‌ఖాన్ మేడ్చల్ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో తమదైన శైలిలో విచారణ జరుపగా పశువుల చోరీల విషయం తెలిపారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగుసార్లు, దుండిగల్, కేపీహెచ్‌బీ, పహాడీషరీఫ్, మేడిపల్లి ప్రాంతాల్లో పశువులను అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. వీరి గ్యాంగ్‌లోని మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షలు, టాటా వింగర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి వివరించారు. అనంతరం నిందితులను రిమాండుకు తరలించినట్లు ఆయన తెలియజేశారు. -
వెహికల్ డిపో అక్రమాలకు బ్రేకుల్లేవ్
అద్దె వాహనాలు పెట్టు.. పర్సంటేజీ పట్టు కోట్లు ఖరీదు చేసే వాహనాలు మూలన.. పేట్రేగుతున్న ఇంటి దొంగలు నగరపాలక సంస్థకు అదో తెల్ల ఏనుగు. ఆదాయాన్ని అందినకాడికి మేసేస్తోంది. కొందరు అధికారులకు దండిగా పర్సంటేజీలు తె చ్చిపెడుతోంది. దాని పేరే వెహికల్ డిపో. లెక్కలేనన్ని విమర్శలు.. కోకొల్లలుగా అవినీతి ఆరోపణలు. ఇంతకుమించి పనిచేయడం కష్టమనే అధికారుల సమర్ధనలు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి వెహికల్ డిపో అక్రమాలకు బ్రేక్‌లు వేయలేకపోతున్నాయి. విజయవాడ సెంట్రల్ : వెహికల్ డిపో కొందరు అధికారులకు కాసులపంట పండిస్తోంది. ఉన్న వాహనాలను మూలనపడేసి అద్దె వాహనాలను తిప్పుతున్నారు. అదేమంటే మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌లే దొరకడం లేదని కథలు చెబుతున్నారు. అధికారుల పర్సంటేజీ మోజు కారణంగా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మూడు నెలల కిందట 30 ట్రాక్టర్లను అద్దెకు పెట్టారు. ఒక్కో దానికి రోజుకు రూ.2,700 చెల్లిస్తున్నారు. నెలకు రూ. 81 వేల చొప్పున ఏడాదికి రూ.24.30 లక్షల అదనపు ఖర్చు అవుతోంది. 2010 మోడల్‌కు చెందిన ఎనిమిది టిప్పర్లను డిపోకే పరిమితం చేశారు. ఒక్క టిప్పర్‌తో రెండు ట్రాక్టర్ల చెత్త ఎత్తే అవకాశం ఉంటుంది. సొంత టిప్పర్లను బాగుచేయించడం మానేసి అద్దె వాహనాల్ని ప్రోత్సహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోట్లు వృథా నరగంలో మెరుగైన పారిశుధ్యం అందించడం కోసం కోట్లు ఖర్చు చేసి కొన్న వాహనాలను మూలనపడేశారు. డ్రెయిన్లలో పూడిక తీసేందుకు రూ.3.60 కోట్లు ఖర్చుచేసి రెండు సూపర్ సెక్టర్లను 2011లో కొనుగోలు చేశారు. స్వల్ప మరమ్మతులకు గురికావడంతో వాటిని పక్కన పెట్టేశారు. కనీసం వాటిని బాగుచేయించాలనే ఆలోచన కూడా అధికారులకు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వారికి పండుగే.. మరమ్మతుల పేరుతో వాహనాలు మూలనపడేయడంతో ఇంటిదొంగలు పండుగ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల్లోని స్పేర్‌పార్ట్స్‌ను ఒక్కొక్కటిగా తీసేసి అమ్మేస్తున్నారు. ప్రస్తుతం రిపేరులో ఉన్న వాహనాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. స్పేర్‌పార్ట్స్ మాయమవుతున్నా బాధ్యులపై సరైన చర్యలు లేకపోవడంతో ఇంటిదొంగలు పేట్రేగుతున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి వెహికల్ డిపో నిర్వహణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిస్థాయి మెకానిక్‌లు అందుబాటులో లేరు. వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం. అవకతవకలకు పాల్పడిన ఏఈని సస్పెండ్ చేశాం. పూర్తిస్థాయిలో దృష్టిపెడతాం. -ఎం.ఎ.షుకూర్, చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ -
సైబరాబాద్ పోలీస్ ‘ఆనంద’
రవాణా కోసం అద్దె వాహనాలు సమయానికి టిఫిన్, భోజనం, తాగునీరు సరఫరా ఫీడింగ్ చార్జీలకు రూ.20 లక్షల కేటాయింపు సాక్షి,హైదరాబాద్: బందోబస్తు విధులంటే సాధారణంగా పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకదు. పోనీ ఉన్న పాయింట్‌ను వదిలి దాహం, ఆకలి తీర్చుకుందామంటే.. ఏమవుతుందో అనే సందేహం. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లాలంటే యాతన పడాల్సిందే. అయితే, ఈసారి మాత్రం సిబ్బందికి ఇలాంటి ఇబ్బందుకు రాకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పలు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో బుధవారం సైబరాబాద్ వ్యాప్తంగా భారీ బందోబస్తు, భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, కేంద్ర సాయుధ బలగాలు కలిపి దాదాపు 10,500 మందిని వినియోగించారు. వీరందరినీ పోలింగ్ బూత్‌ల వద్ద, సమస్యాత్మక ప్రాంతాల్లోనూ, పికెట్స్లో, మొబైల్-షాడో పార్టీలతో పాటు ఇతర ఫోర్సుల్లోనూ నియమించారు. సిబ్బంది మొత్తం రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి విధులు నిర్వర్తించాల్సిన పాయింట్‌కు చేరడానికి, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడానికి సైబరాబాద్ కమిషరేట్‌లో ఉన్నవాటికి తోడు అదనంగా దాదాపు 800 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. మంగళవారం రాత్రి నుంచి నిర్విరామంగా విధుల్లో ఉన్న ఈ సిబ్బందికి కమిషనర్ అనేక సౌకర్యాలు కల్పించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అల్పాహారం, టీ, భోజనం, అనునిత్యం మంచినీళ్ల బాటిళ్లు తదితరాలన్నింటినీ వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బాధ్యతలను ఎక్కడిక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతల్ని ఉన్నతాధికారులకు అప్పగించారు. డ్యూటీలో ఉన్న సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని ఆదేశిస్తూ... అందుకోసం ఫీడింగ్ చార్జీలుగా రూ.20 లక్షలు మంజూరు చేశారు. పోలింగ్ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 నుంచి విస్తృత స్థాయి బందోబస్తు ప్రారంభమైంది. రాత్రి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వాతావరణ ప్రభావం సిబ్బంది మీద పడకుండా సీవీ ఆనంద్ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనా లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.