వెహికల్ డిపో అక్రమాలకు బ్రేకుల్లేవ్
అద్దె వాహనాలు పెట్టు.. పర్సంటేజీ పట్టు
కోట్లు ఖరీదు చేసే వాహనాలు మూలన..
పేట్రేగుతున్న ఇంటి దొంగలు
నగరపాలక సంస్థకు అదో తెల్ల ఏనుగు. ఆదాయాన్ని అందినకాడికి మేసేస్తోంది. కొందరు అధికారులకు దండిగా పర్సంటేజీలు
తె చ్చిపెడుతోంది. దాని పేరే వెహికల్ డిపో. లెక్కలేనన్ని విమర్శలు.. కోకొల్లలుగా అవినీతి ఆరోపణలు. ఇంతకుమించి పనిచేయడం కష్టమనే అధికారుల సమర్ధనలు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి వెహికల్ డిపో అక్రమాలకు బ్రేక్‌లు వేయలేకపోతున్నాయి.
విజయవాడ సెంట్రల్ : వెహికల్ డిపో కొందరు అధికారులకు కాసులపంట పండిస్తోంది. ఉన్న వాహనాలను మూలనపడేసి అద్దె వాహనాలను తిప్పుతున్నారు. అదేమంటే మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌లే దొరకడం లేదని కథలు చెబుతున్నారు. అధికారుల పర్సంటేజీ మోజు కారణంగా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మూడు నెలల కిందట 30 ట్రాక్టర్లను అద్దెకు పెట్టారు. ఒక్కో దానికి రోజుకు రూ.2,700 చెల్లిస్తున్నారు. నెలకు రూ. 81 వేల చొప్పున ఏడాదికి రూ.24.30 లక్షల అదనపు ఖర్చు అవుతోంది. 2010 మోడల్‌కు చెందిన ఎనిమిది టిప్పర్లను డిపోకే పరిమితం చేశారు. ఒక్క టిప్పర్‌తో రెండు ట్రాక్టర్ల చెత్త ఎత్తే అవకాశం ఉంటుంది. సొంత టిప్పర్లను బాగుచేయించడం మానేసి అద్దె వాహనాల్ని ప్రోత్సహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కోట్లు వృథా
నరగంలో మెరుగైన పారిశుధ్యం అందించడం కోసం కోట్లు ఖర్చు చేసి కొన్న వాహనాలను మూలనపడేశారు. డ్రెయిన్లలో పూడిక తీసేందుకు రూ.3.60 కోట్లు ఖర్చుచేసి రెండు సూపర్ సెక్టర్లను 2011లో కొనుగోలు చేశారు. స్వల్ప మరమ్మతులకు గురికావడంతో వాటిని పక్కన పెట్టేశారు. కనీసం వాటిని బాగుచేయించాలనే ఆలోచన కూడా అధికారులకు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
వారికి పండుగే..
మరమ్మతుల పేరుతో వాహనాలు మూలనపడేయడంతో ఇంటిదొంగలు పండుగ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల్లోని స్పేర్‌పార్ట్స్‌ను ఒక్కొక్కటిగా తీసేసి అమ్మేస్తున్నారు. ప్రస్తుతం రిపేరులో ఉన్న వాహనాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. స్పేర్‌పార్ట్స్ మాయమవుతున్నా బాధ్యులపై సరైన చర్యలు లేకపోవడంతో ఇంటిదొంగలు పేట్రేగుతున్నారు.
చాలా ఇబ్బందులు ఉన్నాయి
వెహికల్ డిపో నిర్వహణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిస్థాయి మెకానిక్‌లు అందుబాటులో లేరు. వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం. అవకతవకలకు పాల్పడిన ఏఈని సస్పెండ్ చేశాం. పూర్తిస్థాయిలో దృష్టిపెడతాం.
-ఎం.ఎ.షుకూర్, చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ