- రవాణా కోసం అద్దె వాహనాలు
- సమయానికి టిఫిన్, భోజనం, తాగునీరు సరఫరా
- ఫీడింగ్ చార్జీలకు రూ.20 లక్షల కేటాయింపు
సాక్షి,హైదరాబాద్: బందోబస్తు విధులంటే సాధారణంగా పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకదు. పోనీ ఉన్న పాయింట్‌ను వదిలి దాహం, ఆకలి తీర్చుకుందామంటే.. ఏమవుతుందో అనే సందేహం. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లాలంటే యాతన పడాల్సిందే. అయితే, ఈసారి మాత్రం సిబ్బందికి ఇలాంటి ఇబ్బందుకు రాకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పలు చర్యలు తీసుకున్నారు.
పోలింగ్ నేపథ్యంలో బుధవారం సైబరాబాద్ వ్యాప్తంగా భారీ బందోబస్తు, భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, కేంద్ర సాయుధ బలగాలు కలిపి దాదాపు 10,500 మందిని వినియోగించారు. వీరందరినీ పోలింగ్ బూత్‌ల వద్ద, సమస్యాత్మక ప్రాంతాల్లోనూ, పికెట్స్‌లో, మొబైల్-షాడో పార్టీలతో పాటు ఇతర ఫోర్సుల్లోనూ నియమించారు.
సిబ్బంది మొత్తం రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి విధులు నిర్వర్తించాల్సిన పాయింట్‌కు చేరడానికి, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడానికి సైబరాబాద్ కమిషరేట్‌లో ఉన్నవాటికి తోడు అదనంగా దాదాపు 800 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. మంగళవారం రాత్రి నుంచి నిర్విరామంగా విధుల్లో ఉన్న ఈ సిబ్బందికి కమిషనర్ అనేక సౌకర్యాలు కల్పించారు.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అల్పాహారం, టీ, భోజనం, అనునిత్యం మంచినీళ్ల బాటిళ్లు తదితరాలన్నింటినీ వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బాధ్యతలను ఎక్కడిక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతల్ని ఉన్నతాధికారులకు అప్పగించారు.
డ్యూటీలో ఉన్న సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని ఆదేశిస్తూ... అందుకోసం ఫీడింగ్ చార్జీలుగా రూ.20 లక్షలు మంజూరు చేశారు. పోలింగ్ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 నుంచి విస్తృత స్థాయి బందోబస్తు ప్రారంభమైంది. రాత్రి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వాతావరణ ప్రభావం సిబ్బంది మీద పడకుండా సీవీ ఆనంద్ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనా లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.