యంత్రాంగం సన్నద్ధం
ఎన్నికల విధులకు బాధ్యుల నియూమకం
13 విభాగాలకు 20 మంది అధికారులు
వారికి సహాయకులుగా 100 మంది సిబ్బంది
సమీక్షించిన రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ
వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. వచ్చే నెల 21వ తేదీన జరిగే పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక జరిగేందుకు ఎన్నికల అధికారి వాకాటి కరుణ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో ఆమె సోమవారం సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించినందున ప్రస్తుతం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారందరూ డిప్యూటేషన్‌పై భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు భావించాలని ఆమె చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయూలని, వ్యయ పరిశీలన తదితర ప్రాధాన్యత అంశాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా ఉండే 13 విభాగాలకు 20 మంది జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. వీరికి సహాయకులుగా 100 మంది సిబ్బందిని నియమించారు.
వీరి నియూమకాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ తీసుకున్న నిర్ణయం మేరకు సహాయక రిటర్నింగ్ అధికారి(డీఆర్వో) కె.శోభ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పులు లేని ఓటర్ల జాబితా అంశాన్ని మెప్మా పీడీ పురుషోత్తం, పోలింగ్ కేంద్రాల్లో వీడియో పర్యవేక్షణ బాధ్యతలను దళిత సంక్షేమ అభివృద్ధి శాఖ ఏడీ శంకర్‌లు నిర్వహిస్తారు. మానవ వనరుల నిర్వహణను ముఖ్య ప్రణాళికాధికారి వి.లలిత్‌కు, రవాణా నిర్వహణకు డీటీసీ శివనాగయ్యకు అప్పగించారు. సిబ్బంది శిక్షణ నిర్వహణను డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రావు, సామగ్రి(మెటీరియల్) నిర్వహణను ఎన్‌సీఎల్ ప్రాజెక్టు అధికారి కె.ప్రసాదరావు పర్యవేక్షిస్తారు. మీడియా సర్టిఫికెషన్, మానిటరింగ్ కమిటీని సమాచార శాఖ ఏడీ డీఎస్ జగన్, మీడియా, కమ్యూనికేషన్‌ను పీఆర్వో పి.శ్రీనివాస్, ఎన్నికల అంశాల కంప్యూటరైజేషన్, కమ్యూనికేషన్ ప్రణాళికను జిల్లా ఇన్‌ఫర్‌మేటిక్స్ అధికారి వి.విజయకుమార్‌లు నిర్వర్తిస్తారు. పోలింగ్ స్టేషన్లకు విద్యుత్, ఇంటర్నెట్, ర్యాంపులు తదితర సౌకర్యాలను పోలింగ్ స్టేషన్లకు కల్పించే ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ టి.మధుసూదన్, బీఎస్‌ఎన్‌ఎల్ డీఈ కౌండిన్యకుమార్, ఆర్‌వీఎం ఈఈ ఎం.రవీందర్‌లకు అప్పగించారు. పోలింగ్ స్టేషన్లకు తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లను వరంగల్ మునిసిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఎల్.రామ్‌చంద్ పర్యవేక్షిస్తారు.
రేపటి వరకు అవకాశం...
మెరుగైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరూ బుధవారంలోపు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు కాలేజీల ప్రిన్సిపాళ్లు యువతను ప్రోత్సహించాలని కోరారు. ఈ-సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో యువత తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ కరుణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.