
ఎండలో నిలబడి రేవంత్ నిరసన
అన్యాయంగా సభనుంచి సస్పెండ్ చేశారని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్రవెంకటవీరయ్య సోమవారం అసెంబ్లీ ప్రధానద్వారం ఎదురుగా, మండు టెండలో నిలబడి నిరసన తెలియజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంతో పాటు, అసెంబ్లీ జరిగిన సమయం అంతా వారు ఎండలోనే నిలబడ్డారు.
మరో టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా అసెంబ్లీ లోపలికి వెళ్లలేదు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో సభ పూర్తిగా ఆయన ఆధీనం లోనే ఉంటుందని, ఆ సమయంలో ఏం జరిగినా స్పీకర్‌కు సస్పెండ్ చేసే అధికారం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు అధికారంలేకున్నా, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారనే సాకుతో తమను సస్పెండ్ చేయడం ద్వారా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.