
కేసీఆర్‌ను కుర్చీలోంచి దించుతా..
* ఏసీబీ దాడి అనంతరం మీడియాతో రేవంత్
* అనుయాయులకు కట్టబెట్టిన అక్రమాస్తులపై కేసులు పెట్టిస్తా
* నాపై ప్రయోగించిన పోలీసులతోనే వారిని ఈడ్చుకొచ్చి లోపలేయిస్తా
* ఏసీబీ దాడి అనంతరం మీడియాతో రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కుర్చీలోంచి దించుతా. ఆయన పరిపాలనలో ఏవైతే అక్రమంగా ఆస్తులను అనుయాయులకు కట్టబెట్టిండో వాటిపై కేసులు కట్టిస్తా. ఈ రోజు నాపై ప్రయోగించిన పోలీసులతోనే వారిని ఈడ్చుకొచ్చి లోపలేపిస్తా. వీటన్నింటినీ రాజకీయంగా ఎదుర్కొంటా. నాకు మనోస్థైర్యం ఉంది. నా వెనుక పార్టీ ఉంది. కార్యకర్తలు, అభిమానుల అండ ఉంది...’ అని తనపై ఏసీబీ దాడుల అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
మిత్రుడు సమస్య చెప్పుకుంటానంటే వచ్చా
‘నా మిత్రుడు ఏదో సమస్య చెప్పుకుంటా రాండ్రి అంటే వచ్చా. నాలుగు గంటలకు చంద్రబాబును కలవాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఇక్కడికి వచ్చినా.. ఇక్కడికి వచ్చినాక ఇది జరిగింది. సీఎం కేసీఆర్ శాసనమండలి సీట్లు గెలవాలనే కోరికతోనో లేదా తెలుగుదేశం పార్టీని, రేవంత్‌రెడ్డిని ఎదుర్కొలేక గతంలో ఏవైతే అక్రమ కేసులు పెట్టాడో అందులో భాగంగా ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నాడు. రాబోయే 25 సంవత్సరాల్లో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రశేఖర్‌రావుపై పోరాడతా. ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇది రేవంత్‌రెడ్డి తెలుగుదేశం వర్సెస్ కేసీఆర్ టీఆర్‌ఎస్. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా నైతిక స్థైర్యం కోల్పోను. ధైర్యంగా నిలబడతా’ అని రేవంత్ పేర్కొన్నారు.
తీసుకొచ్చి లోపలేస్తే ఏం చేస్తావ్...
మీ దగ్గర రూ.50 లక్షలు దొరికినట్లుగా ఏసీబీ అధికారులు అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా ఆగ్రహంగా ఊగిపోయిన రేవంత్‌రెడ్డి..‘పోలీసులు నిన్ను తీసుకొచ్చి లోపల వేసి.. నీ పేరు రాస్తే ఏం చేస్తావ్.. పోలీసులు ఎవరు.. ఎవరి ప్రభుత్వంలో పని చేస్తున్నారు.. ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే మీకు తెల్వదా. మీడియా గొంతు కోసినప్పుడు తెలియదా. చంద్రశేఖర్‌రావుగారు తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు..’ అని ఆరోపించారు.