మంగళవారం రేవంత్‌రెడ్డిని చర్లపల్లి సెంట్రల్ జైల్‌కు తరలిస్తున్న పోలీసులు
ఎన్ని కోట్లయినా ఎమ్మెల్సీని గెలుచుకోవాలని వ్యూహం
♦ కనీసం ఐదుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్
♦ డీల్ కుదిర్చే బాధ్యతలు రేవంత్‌కు
♦ ఐదేసి కోట్లు ఇస్తామంటూ నలుగురు ఎమ్మెల్యేలకు ఆఫర్
♦ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు 50 లక్షల అడ్వాన్స్
♦ స్టీఫెన్‌కు డబ్బులివ్వబోయి ఏసీబీకి చిక్కిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్ని కోట్లు ఖర్చయినా సరే.. ఎలాగైనా తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలి. కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలనైనా కొనుగోలు చేయాలి’.. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం. రాష్ర్ట విభజన తర్వాత 40 మంది ఎమ్మెల్సీలతో కొలువుదీరిన మండలిలో టీడీపీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం లేకపోయింది. ఇప్పటికే ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరిపోవడం, మరొకరు పదవీ విరమణ చేయడంతో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యే కోటాలో ఒకరిని మండలికి పంపాలన్న పట్టుదలతో బాబు ఉన్నారు.
ఇందుకోసం కోట్లు గుమ్మరించేందుకు సిద్ధపడ్డారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారు. రేవంత్ కోరుకున్నట్లు వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. అతణ్ని గెలిపించుకునేందుకు అన్ని విధాలా ఆర్థిక సాయం చేసేందుకు బాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే నోటిఫికేషన్ వెలువడటంతోనే రేవంత్ రంగంలోకి దిగారు.
తెరవెనక బాబు మంత్రాంగం
పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బాబు పెద్ద మంత్రాంగమే నడిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకోసం ఆర్థికావసరాలు ఉన్న నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, నామినేటెడ్ ఎమ్మెల్యేను గుర్తించారు. వీరందరికీ రూ.5 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. డబ్బు సమకూర్చే బాధ్యతను టీడీపీకే చెందిన ఓ ఎంపీకి అప్పగించారు.
సదరు ఎంపీ సూచనల మేరకు డబ్బును జూబ్లీహిల్స్‌లోని ఓ సినీ నిర్మాత ఇంటికి చేర్చారు. అక్కడి నుంచి కొంత డబ్బును అడ్వాన్స్‌గా ఎమ్మెల్యేలకు చేరవేసే బాధ్యతను రేవంత్‌కు అప్పగించారు. టీఆర్‌ఎస్ తీరుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ అసంతృప్తితో ఉన్నారని అంచనాకు వచ్చిన రేవంత్.. ఆయనను ముగ్గులోకి దింపేందుకు టీడీపీ సానుభూతిపరుడు మాథ్యూస్ జెరూసలెం(మత్తయ్య)ను రంగంలోకి దింపారు.
ఇది కొంత ఆలస్యం అవుతుండడంతో మరో మధ్యవర్తి సెబాస్టియన్ రంగ ప్రవేశం చేశారు. రూ.5 కోట్ల డీల్ కావడంతో బాబుతోనూ రేవంత్ మాట్లాడించినట్లు సమాచారం. ఈ తతంగంపై 29వ తేదీ రాత్రే ఏసీబీ చీఫ్ ఎకే ఖాన్‌కు స్టీఫెన్ ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకే రేవంత్‌తో స్టీఫెన్ సంభాషణలు సాగాయి. రేవంత్‌ను తన ఇంటికి కాకుండా, లాలాగూడలోని తన దగ్గరి బంధువు నివాసానికి పిలిపించారు.
పోలింగ్‌కు ముందు రోజు మధ్యాహ్నం నుంచి డీల్‌లో భాగంగా అడ్వాన్స్ చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ముట్టజెప్పారు. స్టీఫెన్‌కు కూడా ముట్టజెప్పేందుకు ఆయన చెప్పిన చిరునామాకు వెళ్లి రేవంత్ ఆయన అనుచరులు చిక్కిపోయారు. రేవంత్ అరెస్టు కావడంతో అప్పటికే డబ్బు తీసుకున్న ఎమ్మెల్యే కూడా భయపడి అడ్వాన్స్ సొమ్మును అప్పటికప్పుడు వెనక్కి పంపించినట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రచారం చేశారు.
దీంతో మిగతా ముగ్గురు కూడా తాము డబ్బు తీసుకోబోమంటూ మధ్యవర్తులకు సమాచారం పంపారు. వారి మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. అప్పటికే రేవంత్ వారితో ఒకటికి రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడి డీల్ సెట్ చేశారు. ఈ ఫోన్లతోనే నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులకు సమాచారం చేరిపోయింది. ఈ సమాచారం ఆధారంగానే గత నెల 29న టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఎవరెవరితో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ రంగ ప్రవేశంతో చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణలో ఈ అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టేందుకు రేవంత్‌ను పది రోజులపాటు కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది.