
దత్తత గ్రామాన్ని వల్లకాడు చేసిన సీఎం కేసీఆర్
మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే.....
చిన్నముల్కనూర్ సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
చిగురుమామిడి: మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చి నేడు గ్రామాన్ని వల్లకాడు చేశాడని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. చిన్నముల్కనూర్ గ్రామాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. డబుల్ బెడ్‌రూం నిర్మాణం కోసం ఉన్న ఇళ్ల్లను కూల్చివేసుకుని గుడిసెలు, రేకుల షెడ్లలో కాలం వెళ్లదీస్తున్న చిలుకమ్మ, రజితతోపాటు పలువురు బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చిన్నముల్కనూర్‌లోని మహిళల మానప్రాణాలతో సీఎం ఆటలాడుకుంటున్నాడని, గోనె సంచులు అడ్డంకట్టుకుని స్నానాలు చేస్తున్న పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఇండ్లు కూల్చివేసి పందిళ్ల కింద తలదాచుకుంటున్నా సీఎంకు ఎందుకు కనికరం కలగడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే గ్రామంలో ఏడు నెలల కింద నిర్మించిన మోడల్ హౌస్‌కు అధికారులు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముందుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుతాన్ని నిలదీస్తామన్నారు.