టీచర్లకు టెస్ట్‌లు! | Review Of The Performance Of New Faculty In IITs | Sakshi
Sakshi News home page

టీచర్లకు టెస్ట్‌లు!

Published Sat, Oct 19 2019 2:53 AM | Last Updated on Sat, Oct 19 2019 2:53 AM

Review Of The Performance Of New Faculty In IITs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:ఐఐటీల్లో ఇంజనీరింగ్‌ విద్యా బోధనలో నాణ్యతాప్రమాణాల పెంపు దిశగా చర్యలను ఐఐటీల కౌన్సిల్‌ వేగవంతం చేసింది. బోధనలో నాణ్యత తగ్గిపోతుండటంతో అంతర్జాతీయ స్థాయిని అందుకోలేకపోతున్నామని భావనకొచ్చింది. అందుకే ప్రస్తుత స్థానాన్ని మెరుగు పరుచుకోవడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చేలా చర్య లు చేపడుతోంది.ఇందులో భాగంగా ఐఐటీలకు అకడమిక్‌ ఫ్రీడంతోపాటు వివిధ ఐఐటీల్లో కొత్త అధ్యాపకుల బోధన తీరుతెన్నులపైనా సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.అధ్యాపకులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ఇటీవల జరిగిన కౌన్సిల్‌ భేటీలో నిర్ణయించారు.

మూడేళ్ల తర్వాత మూల్యాంకనం... 
పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి అనుభవం లేకపోయినా ప్రతిభావంతులైన వారిని ఖాళీగా ఉన్న స్థానాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమించి మూడేళ్ల తరువాత వారి పనితీరును ఐఐటీ అంతర్గత కమిటీలతో మూల్యాంకనం చేస్తారు. 5.5 ఏళ్ల తరువాత ఫ్యాకల్టీ పనితీరు, పరిశోధన, బోధన, తదితర అంశాల్లో ఎక్స్‌టర్నల్‌ కమిటీతో సమీక్షించి వారికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలా? లేదా బయటకు పంపించాలా? అన్న విషయాన్ని తేలుస్తారు.

అంటే ఐదున్నరేళ్ల పాటు వారు కాంట్రాక్టు లేదా తాత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌టర్నల్‌ కమిటీ వాల్యుయేషన్‌ తరువాతే వారి రెగ్యులరైజేషన్‌ అంశం తేల్చాలని, ఈ విధానాన్ని కొత్తగా నియమితులయ్యే వారికే వర్తింపజేయాలన్న ఆలోచనలో ఉంది. అలాగే అధ్యాపకులపై అడ్మినిస్ట్రేటివ్‌ పని భారాన్ని తగ్గించనున్నారు. దీంతో వారు పరిశోధనల పట్ల ప్రత్యేక శ్రద్ధవహిస్తారని, తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతుందని కౌన్సిల్‌ భావిస్తోంది.

వెనుకబడితే బీఎస్సీ ఇంజనీరింగ్‌... 
ఐఐటీల్లో చేరే విద్యార్థులు సాధారణ విద్యార్థులకంటే కొంత ప్రతిభ కలిగిన వారే అయినా, వాటిల్లో చేరిన అందరూ ఒకేలా ఉండరు. వారి ప్రతిభలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వెనుకబడిన వారి కోసం బీఎస్సీ ఇంజనీరింగ్‌ చదివే అవకాశాన్ని కల్పించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులు తమ ప్రథమ సంవత్సరం (రెండో సెమిస్టర్‌) తర్వాత తమ సామర్థ్యాలను,రెండో సెమిస్టర్లో వారికి వచ్చే క్రెడిట్స్‌ను బట్టి,బీటెక్‌ కొనసాగకుండా బీఎస్సీ ఇంజనీరింగ్‌ చదువుకోవచ్చు.మూడేళ్లకే ఈ డిగ్రీని ఐఐటీలు అందజేయాలని కౌన్సిల్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని నిబంధనలను ఐఐటీలే సొంతంగా రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేసింది.

పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం.. 
ఐఐటీల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచి బలోపేతం చేసేందుకు ఐఐటీల కౌన్సిల్‌ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి వర్సిటీల్లో దేశంలోని ఐఐటీలు, విద్యా సంస్థలు టాప్‌ 250–300 స్థానాల్లోనే ఉన్నాయి. ఇటీవల టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసిన సర్వేలో ఇదే తేలింది.

ఈ నేపథ్యంలో రీసెర్చ్, డెవలప్‌మెంట్, ప్రమాణాల పెంపులో అధ్యాపకులు కచ్చితమైన బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడుతోంది. అందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఐఐటీలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తమే కాకుండా పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించింది.

పరిశోధనలకు పెద్దపీట  
దేశంలోని ఐఐటీలతోపాటు ఇండియన్‌ వర్సిటీలకు చెందిన ప్రముఖులు అనేక మంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్నారు. అయినా దేశీయ విద్యా సంస్థలకు భారీగా నిధులను రాబట్టుకోలేకపోతున్నామన్న అంచనాకు కౌన్సిల్‌ వచ్చింది. హార్వర్డ్‌ వర్సిటీకి పూర్వ విద్యార్థుల నుంచి ఏడాదికి దాదాపు రూ. 800 కోట్లొస్తే.. 2017లో ఐఐటీ మద్రాసు రూ. 55 కోట్లే రాబట్టుకోగలిగింది. 2016లో అమెరికన్‌ వర్సిటీలు పూర్వ విద్యార్థుల నుంచి దాదాపు 535 బిలియన్‌ డాలర్లు సమకూర్చుకోగా, అందులో 25 టాప్‌ వర్సిటీలు 52 శాతం నిధులను పొందాయి.

దేశంలోని విద్యా సంస్థలు కూడా ఆ స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ఐఐటీల్లో చదువుకొని విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల సంపాదన నుంచి కనీసంగా ఒక శాతం మొత్తాన్ని ఐఐటీల అభివృద్ధికి వెచ్చించాలని విజ్ఞప్తి చేసే విధానాన్ని అమలు చేయనున్నారు.

ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల సమీక్ష...
ఐఐటీల్లో విభాగాల వారీగా ఉన్న అకడమిక్‌ కమిటీల ఆధ్వర్యంలో కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను సమీక్షించేందుకు చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్‌ విద్యలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఒక సెమిస్టర్‌ పూర్తయ్యాక ఆయా కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలపైనా విద్యార్థుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంది. వారి సూచనలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడంతోపాటు బోధనలో నాణ్యతాప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement