అప్పటిదాకా ఆనందం... అంతలోనే విషాదం..
అప్పటిదాకా ఆనందోత్సాహాలతో కళకళలాడిన ఆ ఇంట... అంతలోనే, మిన్నంటిన రోదనలతో అంతులేని విషాదం అలుముకుంది. కొత్తగూడెంలోని హనుమాన్ బస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి బూదాటి వెంకటేశ్వరరావు చిన్న కుమారుడు కిషోర్(26) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో ఇతని అన్న నరేంద్రకుమార్(28) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని వివాహం ఈ నెల 15న జరగాల్సుంది.
ఖమ్మం క్రైం: నగరంలోని శ్రీశ్రీ విగ్రహం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు గురువారం మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ టీవీ చానల్‌లో స్క్రోలింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొత్తగూడెం పట్టణానికి చెందిన బూదాటి కిషోర్(25), తన అన్న నరేందర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్నాడు. నగరంలోని బైపాస్ రోడ్డులోగల శ్రీశ్రీ విగ్రహం సర్కిల్ వద్ద స్పీడ్ బ్రేకర్ కనిపించకపోవడంతో మోటార్ సైకిల్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషోర్, నరేందర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కిషోర్ గురువారం ఉదయం మృతి చెందాడు. నరేందర్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం విజయవాడలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆనందం... ఆవిరి..
లక్ష్మిదేవిపల్లి: కొత్తగూడెంలోని హనుమాన్ బస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి బూదాటి వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు నరేంద్ర కుమార్(28) షేర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు కిషోర్(26) హైదరాబాద్‌లోని టీవీ చానల్‌లో స్క్రోలింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నరేందర్ వివాహం ఈ నెల 15వ తేదీన జరగాల్సుంది. ఖమ్మంలోని బంధు మిత్రులకు పెళ్లి కార్డులు పంచేందుకని నరేందర్ బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. కిషోర్ కూడా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాడు. వీరిద్దరూ కలిసి బుధవారం రాత్రి పది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కిషోర్ మృతి వార్త విన్నంతనే తల్లి స్పృహ కోల్పోయింది. ఇంటిలోని కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ప్రమాద వార్తతో హనుమాన్ బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.