సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 45 రోజులుగా నిలిచిపోయిన ఆర్టీఏ కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వివిధ రకాల పౌరసేవల కోసం అధికారులు బుధవారం రవాణా శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్‌లను అందుబాటులోకి తెచ్చారు. గురువారం నుంచి స్లాట్‌లు పరిమిత స్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, బదిలీలు, డూప్లికేట్ డాక్యుమెంట్‌లు తదితర సేవల కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో స్లాట్‌లను నమోదు చేసుకొని ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌కు ముందు (మార్చి 23)స్లాట్‌లను నమోదు చేసుకుని ఫీజులు చెల్లించినవారికి రానున్న వారం రోజుల్లో దశలవారీగా సేవలను అందజేయనున్నట్లు ఉప రవాణా శాఖ కమిషనర్ (విజిలెన్స్)కె.పాపారావు తెలిపారు. లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి ముగిసి లాక్‌డౌన్ కారణంగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి కూడా లెర్నింగ్ లైసెన్సుల గడువును పొడిగించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్– 19 పరిస్థితుల దృష్ట్యా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ప్రతి వినియోగదారుడూ కచ్చితమైన భౌతిక దూరం పాటించాలని సూచించారు. దరఖాస్తుదారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాలకు రావాలని చెప్పారు. ఇతరులకు ఎలాంటి అనుమతులు ఉండబోవన్నారు.
మాస్క్‌ఉంటేనే..
♦ ప్రతి వాహన వినియోగదారుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా వస్తే వాహనాల రిజిస్ట్రేషన్‌లు సహా ఎలాంటి సేవలనైనా నిలిపివేస్తారు.
♦ కార్యాలయంలోకి వచ్చిన ప్రతి వ్యక్తికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తారు. వ్యక్తుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటించేందుకు అన్ని చోట్లా మార్కింగ్ చేస్తారు. అందుబాటులో శానిటైజర్లను కూడా ఉంచుతారు.
♦ వాహనదారులకు నిర్దేశించిన స్లాట్ ప్రకారమే రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు మధ్యాహ్నం 2 గంటలకు సమయం కేటాయిస్తే ఆ సమయానికే రావాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యంగా వచ్చినా స్లాట్ రద్దు చేస్తారు. నిర్దేశించిన సమయానికి ముందే వచ్చినా ఇబ్బందే.
♦ సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ ఉంటే చాలామంది ఉదయం 10 గంటలకే ఆఫీస్‌లకు వస్తారు. ఇక నుంచి అలా రావడానికి వీల్లేదు. నిర్ణీత సమయానికే రావాలి. ముందుగా వచ్చేవారిని లోనికి అనుమతించబోరు.
♦ దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే రావాలి, ఇతరులకు ప్రవేశం ఉండదు. దివ్యాంగులు, సీనియర్ సిటీజన్‌లు మాత్రం సహాయకులను వెంట తెచ్చుకోవచ్చు.
50 శాతం స్లాట్‌లు మాత్రమే...
♦ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు స్లాట్‌ల సంఖ్యను సైతం కుదించారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో సాధారణ రోజుల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 50శాతం స్లాట్‌లను మాత్రమే అనుమతిస్తారు. దీంతో ఎక్కువ మంది గుమిగూడకుండా నియంత్రించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రూ.350 కోట్ల నష్టం
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా రవాణాశాఖ సుమారు రూ.350 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. ఫీజులు, వివిధ రకాల పన్నులు, సేవలపై ఈ ఆదాయం లభిస్తుంది.రవాణా వాహనాలపై జూన్‌లో త్రైమాసిక పన్ను చెల్లించాలి. బీఎస్– 4 వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌ల కోసం ప్రత్యేకంగా స్లాట్‌లు నమోదు చేసి సేవలు అందజేస్తాం. – కె.పాపారావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్)
Comments
Please login to add a commentAdd a comment