సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మార్గాల్లో ఇరువైపుల కాలనీల్లోకి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో తొలి కారిడార్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 24 మెట్రో రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తూ ఇరువైపుల 22 కాలనీలకు 212 ట్రిప్పుల్లో బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా ఐటీ కారిడార్‌కు 10 రూట్లలో 50 బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు.
దీనికి సంబంధించి గీతం విద్యాలయ విద్యార్థులు సర్వే చేసినట్టు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్‌నాయక్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో మెట్రోరైలు అన్ని కారిడార్లలో ఆర్టీసీ అనుసంధానమవుతుందని మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైలుతో కలసి ఆర్టీసీ సంయుక్త టికెట్ విధానంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదన్నారు.
త్వరలో 1,400 కొత్త బస్సులు: భవిష్యత్తులో మినీ బస్సులను మరింతగా అనుసంధానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో మరో 1,400 కొత్త బస్సులు కొనే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. కొత్త బస్సుల కొనుగోలులో కాలుష్య అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఉన్నంతలో ఎలక్ట్రిక్ బస్సులు వాడతామన్నారు. ముంబై, బెంగళూరు తరహాలో ఆర్టీసీ సేవలను మెరుగుపరుస్తామన్నారు. హైదరాబాద్‌లో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సు కోసం వచ్చే ప్రతినిధులకు ఆర్టీసీ గరుడ, మినీ ఏసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment