
సాక్షి, హైదరాబాద్: తలపై టోపీ.. నేవీ బ్లూ రంగు యూనిఫాం.. క్రమశిక్షణ ఉట్టిపడే రూపం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ప్రధాన ఆకర్షణగా అట్టహాసంగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల సిబ్బంది వీరు. వీరిని చూస్తే ఆర్టీసీ సిబ్బంది దర్పం ఇలాగే ఉంటుందనుకుంటారు కదా! కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. నాలుగేళ్లుగా ఆర్టీసీ కార్మికులకు యూనిఫామ్ అందటం లేదు. నిధులకు కటకట ఉండటంతో ఆర్టీసీ యాజమాన్యం 2014 నుంచి యూనిఫాం ఇవ్వటం లేదు. గతంలో ఇచ్చిన యూనిఫాంతోనే ఇప్పటివరకు కాలం నెట్టుకొచ్చిన కార్మికులు, ఇప్పుడు అవి చిరిగిపోవటంతో కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు.
యాజమాన్యం కొత్త యూనిఫాం ఇవ్వటం లేదు. యూనిఫాం లేకుండా విధులకు హాజరైతే స్థానిక అధికారులు ఊరుకోవటం లేదు. దీంతో కార్మికులు సొంతంగా యూనిఫాం కొని విధులకు రావాల్సిన దుస్థితి నెలకొంది. వేతన సవరణ, వసతుల కల్పన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం ఇంతకాలం నిరసనలు, ధర్నాలు చేపట్టిన కార్మికులు ఇప్పుడు యూనిఫాం కోసం ఆందోళనకు దిగాల్సి పరిస్థితి ఏర్పడింది. సాధారణ దుస్తులతో విధులకు వెళ్తే అధికారులు క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ సమయంలో ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. మరోవైపు యూనిఫాం పంపిణీలో అలసత్వం వహించడం విడ్డూరంగా కనిపిస్తోంది.
సొంతంగా కొనక తప్పనిస్థితి
డ్రైవర్, కండక్టర్, సెక్యూరిటీ, మెకానిక్ తదితరులు ఖాకీరంగు యూనిఫాం ధరిస్తారు. ఏసీ బస్సుల్లో అయితే నేవీ బ్లూ ఉంటుంది. ప్రస్తుతం ఏసీ బస్సుల సిబ్బందికి మాత్రమే యూనిఫాం ఇస్తున్నారు. గతం లో ప్రతి రెండేళ్లకు మూడు జతల యూనిఫాం దుస్తు లు ఇచ్చేవారు. ప్యాంటు కోసం 1.20 మీటర్లు, చొక్కా కోసం 1.80 మీటర్ల చొప్పున వస్త్రాన్ని అందించేవారు. 2014 ఆరంభంలో ఇచ్చిన మూడు జతల దుస్తులతోనే ఇప్పటివరకు నెట్టుకొచ్చారు.
కొన్ని డిపోల్లో కార్మికులు సాధారణ దుస్తుల్లో వెళ్లటంతో అది క్రమశిక్షణ రాహిత్యమంటూ డిపో మేనేజర్లు హెచ్చరించారు. మెమోలు జారీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో కార్మికులే యూనిఫాం కొంటున్నారు. ఈసారి యూనిఫాం ఇవ్వకుంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు సమాచారం. పోలీసులు, తపాలా శాఖ ఉద్యోగులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు.. ఇలా కొన్ని విభాగాల్లో యూనిఫామే గుర్తింపు. అలాంటి కీలక అంశాన్ని ఆర్టీసీ యాజమాన్యం విస్మరించటం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment