మాటకు మాట! | ruling party trs attack on oppositions! | Sakshi
Sakshi News home page

మాటకు మాట!

Published Fri, Jun 13 2014 1:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

మాటకు మాట! - Sakshi

మాటకు మాట!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మారింది. ప్రభుత్వం మారింది. అలాగే శాసనసభలో సాంప్రదాయాలూ మారుతున్నాయి. సభలో విపక్ష సభ్యులు మాట్లాడుతుండగానే ఎప్పటికప్పుడు వివరణలివ్వడమే గాక అక్కడికక్కడే ఎదురుదాడికి కూడా దిగే కొత్త సాంప్రదాయానికి పాలక పక్షం టీఆర్‌ఎస్ తెర తీసింది. గురువారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం మొదలైన తొలి రోజే ఇలాంటి దృశ్యాలు కన్పించాయి. టీఆర్‌ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ సభ్యులు ప్రస్తావించారు. వాటి అమలుపై అనుమానాలు వెలిబుచ్చారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు పలుమార్లు సభ్యులు మాట్లాడుతుండగానే లేచి మధ్యలో జోక్యం చేసుకుంటూ వివరణ ఇచ్చారు. అదే సమయంలో వారిపై మాటల తూటాలు కూడా పేల్చారు. అలా విపక్షాలను ఆత్మరక్షణలో పడేసేందుకు ప్రయత్నించారు. సహజంగా సీఎం, మంత్రులు మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డు తగలడం, పాలక పక్షాన్ని ఇరకాటంలో పెట్టజూడటం పరిపాటి కాగా కొత్త సభలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఇలా సరికొత్త దృశ్యాలుకన్పించాయి.
 
 పైగా విపక్షాలనే ముందస్తుగా ఆత్మరక్షణలో పడేసే ఈ వ్యూహంలో పాలకపక్ష సారథి అయిన ముఖ్యమంత్రి కూడా భాగస్వామి కావడం ఆసక్తికర పరిణామం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు పలు అంశాలు లేవనెత్తుతుంటారు. వాటన్నింటినీ సీఎం వింటూ చివర్లో వివరణ ఇస్తుంటారు. కానీ గురువారం మాత్రం సభ్యులు మాట్లాడుతుండగానే సీఎం, మంత్రులు కనీసం అరడజనుసార్లు లేచి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ విపక్షాలనే ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం ఇలా ఉంది...
 ఎర్రబెల్లి దయాకరరావు(టీడీపీ): తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఇంటికో ఉద్యోగం, భూమి ఇస్తామని, రైతు, డ్వాకా రుణాలను మాఫీ చేస్తామనే హామీలు నమ్మి జనం మీకు ఓటేశారు. మా ఇంట్లో పని చేసేవాళ్లు కూడా కారు గుర్తుకే ఓటేశామన్నారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడేమో గతేడాది తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని లీకులిస్తుండ్రు. రుణ మాఫీని ఎప్పుడు, ఎంతమందికి చేస్తారో చెప్పండి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారా?
 
 కేసీఆర్: లీకులిచ్చే ఖర్మ మాకు పట్టలేదు. ఆ జబ్బు ఎవరికుందో మీకే తెలుసు. మేం అధికారంలోకొచ్చి పదిరోజులు కాలేదు. అధికారుల కేటాయింపే పూర్తి కాలేదు. రాష్ట్రస్థాయిలో 70 మంది అధికారులతోనే ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తున్నది. మా మేనిఫెస్టో హామీలను 100% అమలు చేసి తీరుతం. రైతుల పంట రుణాలన్నీ మాఫీ చేస్తం. అందులో అనుమానమే అక్కర్లేదు. అంతమాత్రానికే కోడిగుడ్డు మీద ఈకలు పీకితే ఎట్ల?
 
 ఎర్రబెల్లి: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. అంగన్‌వాడీ, ఐకేపీ, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు. గవర్నర్ ప్రసంగంలో వాటి ఊసే లేదేం?
 కేసీఆర్: నేను సత్యం చెబుతా. అబద్దాలాడటం ఇంకా నేర్చుకోలేదు. చెప్పిందే ధైర్యంగా చేస్తా. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నేను చెప్పనేలేదు. మాఫీ చేయాలని నాపై కొంత ఒత్తిడి వచ్చిన మాట నిజం. దయచేసి వక్రీకరణలు చేయొద్దు. ఇంటికో ఉద్యోగమిస్తమని మేమనలేదు.
 తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ): పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉంటామంటున్నారు. వారి పక్షాన ఉంటామని మాట ఇచ్చాం. దీనిపై అఖిలపక్షం వేయండి.
 
 కేసీఆర్: పోలవరంపై చివరిదాకా పోరాడుతం. మీరు, టీడీపీ వాళ్లు మీ అధ్యక్షులతో తేల్చుకోండి
 రేవంత్‌రెడ్డి (టీడీపీ): పోలవరంపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు మీరు (కేసీఆర్) ఎంపీగా ఉన్నారు. రాజ్యసభలో చర్చ జరిగి, ఆర్డినెన్సును ఆమోదం కోసం మార్చి 1న యూపీఏ ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. ఎన్నికల కోడ్ వల్ల దాన్ని తిప్పి పంపారు. మీరేమో రాజకీయం చేస్తున్నారు. మీరు ఆరోపణలతో ముందుకొస్తే మేమూ రెడీ. అప్పుడు సభ నడపడం కూడా కష్టమవుతుంది.
 కేసీఆర్: సభను ఎట్ల నడుపుకోవాల్నో మాకు తెలు సు. మీరు ఆపితే, ఆగితే ఆగదు. ఇంకా ఆ భ్రమల్లో ఉండొద్దు. ఈ పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడే వాళ్లు లేరు. ‘చేయాల్సిందంతా చేస్తాం. జరగాల్సిందంతా జరుగుతుంది. మమ్ములను ఏమీ అనొద్దు’ అంటున్నారు. ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి పోలవరంపై దొంగదారిన, అప్రజాస్వామికంగా ఆర్డినెన్స్ ఇప్పించింది ఎవరు? మీ చంద్రబాబు కాదా? దానిపై నేను ఫైట్ చేస్తానంటే ‘హూ ఆర్ యూ’ అనలేదా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అట్లంటడా? ఇదేనా సంస్కారం?
 
 రెడ్యానాయక్ (కాంగ్రెస్): ఎన్నికల హామీలన్నీ అమలు చేయాల్సిందే. కారుకు ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని తల్లిదండ్రులను బెదిరించి మరీ యువత ఓటేయించారు. ఉద్యోగాలొస్తాయని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.  రైతులకు లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు కేవలం పంట రుణాలని అంటున్నారు. మాట మార్చకుండా రైతుల అన్ని రుణాలనూ మాఫీ చేయాలి.
 
 హరీశ్: తప్పించుకునే సంస్కృతి మా ఇంటా వంటా లేదు. అబద్ధాలు చెప్పే సంస్కృతి అంతకన్నా లేదు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన చరిత్ర మా నాయకునిది. మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం.
 
 ఈటెల: పాలించగల సత్తా టీఆర్‌ఎస్‌కు ఉందని నమ్మే ప్రజలు మాకు పట్టం కట్టారు. మా పాలనను చూశాక విమర్శించండి. ఇంకా పూర్తిస్థాయిలో ఆఫీసులే లేవు. అధికారుల్లేరు.
 జానారెడ్డి (విపక్ష నేత): అధికారులు లేనప్పుడు అసెంబ్లీ ఎందుకు పెట్టారు? రుణమాఫీ ఆరు నెలలకు చేయండి. లేదా ఐదేళ్లకు చేయండి. మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీరిచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే విమర్శలనుకుంటే ఎట్లా? ప్రతిపక్షాలు చెప్పే విషయాలను సహృదయంతో స్వీకరించండి.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement