మహబూబాబాద్: ఓ విద్యార్థి పుస్తకాల సంచిలో రక్తపింజర దాగి ఉన్న సంఘటన, కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన అజ్మీరా అఖిల అనే ఐదవ తరగతి విద్యార్థిని కోమటిపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో చదువుతోంది. నిత్యం ఆటోలో తండా నుంచి తోటివిద్యార్దులతో కలిసి వచ్చే ఆమె రోజుమాదిరిగానే తన బ్యాగ్‌ను ఆటోకి తగిలించి పాఠశాలకు చేరుకుంది. తరగతి గదిలో బ్యాగ్ పెట్టి, ప్రార్ధనకు వెళ్లింది.
అనంతరం తరగతి గదిలోకి వెళ్లి తన బ్యాగ్‌లో నుంచి పుస్తకం తీయడానికి చేయిపెట్టింది. చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్‌ను పూర్తిగా తెరిచి చూడగా లోపల పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా అరిచి ఏడ్చుకుంటూ క్లాస్ టీచర్ క్రిష్ణయ్య వద్దకు వెళ్లి చెప్పింది. దీంతో క్లాస్‌టీచర్, హెచ్‌ఎం సోమిరెడ్డిలు గదిలో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించి, బ్యాగ్‌ను దులిపించడంతో రక్తపింజర బయటపడింది. వెంటనే కర్రతో కొట్టి చంపేశారు. బ్యాగ్‌లో ఉన్న ఆహర పదార్థాలు, పల్లికాయ ఉండటం వల్లనో, ఎలుక, కప్పలను మింగి బ్యాగ్‌లోకి దూరినట్లుందని, చేయి పెట్టినప్పుడు పాము కరవక పోవడం వల్ల విద్యార్థినికి ప్రమాదం తప్పినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
స్కూల్ బ్యాగ్‌లో బుస్ బుస్
Published Tue, Aug 1 2017 8:23 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
Advertisement