ప్రేమించట్లేదని ప్రాణం తీయబోయాడు | sai kumar reddy murder attempt on Sneha | Sakshi
Sakshi News home page

ప్రేమించట్లేదని ప్రాణం తీయబోయాడు

Published Thu, Jul 31 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ప్రేమించట్లేదని ప్రాణం తీయబోయాడు

ప్రేమించట్లేదని ప్రాణం తీయబోయాడు

తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు లోను కావడం, స్నేహాన్ని ప్రేమనుకోవడం, వెంటపడడం, ప్రేమించకపోతే వేధించడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ప్రేమను నిరాకరిస్తే ఉన్మాదిగా మారి దాడులకూ తెగబడుతున్నారు. తనను ప్రేమించడం లేదనే కోపంతో బుధవారం కామారెడ్డిలో ఓ యువకుడు ఉన్మాదిగా మారి తరగతి గదిలోనే సహ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.
 
కామారెడ్డి : లింగంపేట మండల కేంద్రానికి చెందిన కౌడ స్నేహ, మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన సాయికిరణ్‌రెడ్డిలు ఇంటర్మీడియట్ ఒకే కళాశాలలో చదివారు. డిగ్రీలోనూ ఒకే కళాశాలలో చేరారు. కామారెడ్డిలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ ఒకే క్లాస్ చదువుతుండడంతో ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. ఇటీవల సాయికిరణ్‌రెడ్డితో స్నేహ స్నేహం చేయడం లేదని, ఇదే సమయంలో ఇతర విద్యార్థులతో సన్నిహితంగా ఉంటోందని సమాచారం. దీనిని సాయికిరణ్‌రెడ్డి తట్టుకోలేకపోయాడని, ఈ విషయంలో ఇతర విద్యార్థులతో గొడవలకూ దిగాడని తెలుస్తోంది.
 
ఎంతో కాలంగా ప్రేమిస్తున్నా తనను స్నేహ పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్న సాయికిరణ్‌రెడ్డి.. బుధవారం మొదటి పీరియడ్ పూర్తైలెక్చరర్ బయటికి వెళ్లగానే తరగతి గదిలోనే స్నేహపై కత్తితో దాడి చేశాడు. ఆమెకు పలుచోట్ల గాయాలయ్యాయి. ఈ ఘటనతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో సాయికిరణ్‌రెడ్డి తనను తాను పొడుచుకున్నాడు. సంఘటన గురించి కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు స్నేహతోపాటు నిందితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం స్నేహను నిజామాబాద్‌కు, సాయికిరణ్‌రెడ్డిని హైదరాబాద్‌కు పంపించారు. నిందితుడు సాయికిరణ్‌రెడ్డిపై 307, 309, 354, నిర్భయ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సంఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. ముఖ్యంగా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
 
ఉలిక్కిపడ్డ లింగంపేట
లింగంపేట : మండల కేంద్రానికి చెందిన కౌడ స్నేహపై కామారెడ్డిలో కళాశాలలో కత్తిపోట్లు జరగడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హుటాహుటిన కామారెడ్డి వెళ్లారు. విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన సహ విద్యార్థి సాయికిరణ్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
 
మూడేళ్ల క్రితం..
కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో మూడేళ్ల క్రితం ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థి బలైన విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని పదునైన కత్తితో గొంతుకోసి పాశవికంగా చంపాడు. ఆ సంఘటనలో నిందితునికి జీవితఖైదు పడింది. అయినా ప్రేమోన్మాదుల ఆగడాలు తగ్గడం లేదు.
 
కుదిరితే ప్రేమ.. లేకుంటే వేధింపులు

ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం కళాశాలలకు వచ్చే విద్యార్థినులు అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. తోటి విద్యార్థి అన్న ఉద్దేశంతో కొంచెం స్నేహంగా ఉంటే చాలు.. ఆ అమ్మాయి తనను ప్రేమిస్తుందన్న భావనకు లోనై వెంటపడేవారు కొందరైతే, అందమైన అమ్మాయి కనబడితే చాలు ప్రేమించమంటూ వేధించడం ద్వారా విద్యార్థినులను అల్లరి చేసేవారు ఇంకొందరు.. తమది ప్రేమో, ఆకర్షనో తెలియని పరిస్థితుల్లో కొంత కాలం స్నేహంగా ఉన్న అమ్మాయి.. తర్వాత దూరంగా ఉంటున్నదంటే భరించలేకపోతున్నారు. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే తాను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న వారు ఉన్మాదులుగా మారి దాడులకు పాల్పడుతున్నారు.
 
వివేకం కలిగించడమే తరుణోపాయం
ప్రేమ మైకంలో కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరు ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీరిలో వివేకం నింపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థిలోకంలో మార్పు తేవాలి. వారి దృష్టిని చదువు, లక్ష్యం వైపు మళ్లించాలి. నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను వివరించాలి. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికార యంత్రాంగం కృషి చేస్తే ఇలాంటి ఘటనలను నివారించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement