సరి‘హద్దు’ దాటుతోంది.. | sand mafia in nalgonda | Sakshi
Sakshi News home page

సరి‘హద్దు’ దాటుతోంది..

Published Sat, Nov 22 2014 3:42 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

sand mafia in nalgonda

* రోజుకు రూ.కోట్లల్లో సాగుతున్న ఇసుక దందా
* అనుమతి లేని ఇసుక ఫిల్టర్లతో వాగులు లూటీ
* ఓ కాంగ్రెస్ నేత కనుసన్నల్లోనే..
* సరిహద్దు సాకుతో పట్టించుకోని అధికారులు

 దేవరకొండ/ చింతపల్లి: రోజూ కోట్లల్లో వ్యాపారం, లక్షల్లో లంచాలతో సాగుతున్న ఇసుకవ్యాపారమిది. సరిహద్దు పేరిట సాగే ఓ మాఫియా.. రాజకీయ నాయకుల పలుకుబడి, పోలీసుల నిర్లిప్తత, అధికారుల మామూళ్లు..వెరసి వాగులను, చెరువులను పిండేసి సారాన్ని లాగించేస్తోంది.  మహబూబ్‌నగర్- నల్లగొండ సరిహద్దు ప్రాంతమైన కుర్మేడు, ఘడియగౌరారం, కిష్టరాయినిపల్లి, నందిగడ్డ ాగుల్లో యథేచ్ఛగా ఈ ఇసుక దందా సాగుతోంది.
 
మాఫియా, స్మగ్లింగ్, కిడ్నాప్‌లు... ఇదంతా ఒకప్పటి ట్రెండ్. కానీ ఎటువంటి అడ్డూఅదుపు, కేసులు లేకుండా కోట్లలో సంపాదించుకోవడానికి ఇప్పుడు ఈజీగా మారిన దందా ఇసుక. ఎక్కడ వాగులు, చెరువులు ఉంటే అదే ఈ ఇసుకాసురులకు డెన్. ఈ దందాలో ఎవరు అడ్డొచ్చినా ముందుగా మనీతో కొడితే సరే దెబ్బకు సెట్ అయిపోతారు. అది పోలీసులైనా, అధికారులైనా, గ్రామస్తులైనా. ఎవరికి వారు ఇసుకే కదా అని లంచాలకు అలవాటు పడ్డారు. కానీ ఇసుక మాఫియా రోజూ వ్యాపారులకు కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుందన్న మాట మాత్రం వాస్తవం.
 
సరిహద్దు దందా..
చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు గ్రామం నల్లగొండ-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం. ఈ కుర్మేడు వాగు కుర్మేడు, రాయినిపల్లి, ఘడియగౌరారం, కిష్టరాయినిపల్లి, నందిగడ్డ గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ వాగు రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉండడం ఈ ఇసుక వ్యాపారం ఇంతగా సాగడానికి కారణమైంది. నిత్యం ఈ వాగులోనుంచి సుమారు 30 నుంచి 40 లారీల చొప్పున నెలకు సుమారు వెయ్యి వరకు లారీల ఇసుక హైదరాబాద్‌కు తరలిపోతుంది. ఇప్పటికే ఈ వాగుల పరిధిలో ఇసుక రేణువులు తరిగిపోయాయి. అయినా ఇసుకాసురులు మాత్రం ఇక్కడ ఉన్నంత సులభంగా మరే ప్రాంతంలో ఇసుకను ఎగుమతి చేయలేమని భావించి వాగుల్లో నుంచి ఇసుకను ఫిల్టర్ చేసి మరీ సారం పిండేస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో నాలుగు ఇసుక ఫిల్టర్‌లు ప్రభుత్వ అనుమతి లేకుండా వాగుల్లోనే ఏర్పాటు చేశారు. ఈ దందా వెనుక కొందరు బడా నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన ఓ మాజీ నేత సమీప బంధువు ఒకరు ఈ ఇసుక మాఫియానంతా లీడ్ చేస్తున్నట్లు సమాచారం. అక్రమంగా వాగులోనే ఇసుక ఫిల్టర్‌లు ఏర్పాటు చేసి మరీ లారీలలో ఇసుకను తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఎలా ?  
సరిహద్దులో ఈ వ్యాపారం నిత్యం రూ.కోట్లల్లో జరుగుతోంది. కుర్మేడు ప్రాంతంలో అనుమతి లేని నాలుగు ఇసుక ఫిల్టర్‌లను ఏర్పాటు చేసి రాత్రివేళ అక్రమంగా తరలిస్తున్నారు. ఫిల్టర్ చేసిన ఇసుకను మొదట ట్రాక్టర్లలో సమీపంలోని గోప్య ప్రదేశాలకు తరలించి నిల్వ ఉంచుతున్నారు. అక్కడ జేసీబీల ద్వారా లారీలకు నిమిషాల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. సుమారు రోజుకు 30-40 లారీలను కేవలం ఈ ప్రాంతం నుంచే తరలిస్తారు.

ఒక్కో లారీని హైదరాబాద్‌లో రూ.70 నుంచి రూ.80వేల వరకు విక్రయిస్తుండగా ప్రతినెలా సుమారు 10 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు, ఎస్కార్ట్‌లతో నడిచే ఈ వ్యాపారం మామూళ్లపైనే సాగుతోంది. ఈ వ్యాపారంలో అందరూ పాత్రధారులే. ముందుగా ఇసుకను తరలించేందుకు ఆయా సమీప ప్రాంతంలో ప్రశ్నించే నేతలను డబ్బుతో కొంటారు. ఆ తర్వాత ఇటు రెవెన్యూ, అటు పోలీస్ అధికారులకు నెల నెలా మామూళ్లు ఇస్తారు. అడపాదడపా అడ్డుకోవడానికి చూసే వారిని లారీలకు ముందు నడిచే ఎస్కార్ట్ వాహనంలో ఉన్న మనిషి అప్పటికప్పుడు వెయ్యి నోట్లతో అక్కడికక్కడే కొంటాడు. ఇలా ఈ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
 
సరిహద్దే... సాకు
ఈ వ్యాపారం ఇంతగా సాగడానికి అసలైన కారణం సరిహద్దే. మహబూబ్‌నగర్ - నల్లగొండ సరిహద్దులో ఉన్న  ఈ ప్రాంతంలో జరిగే ఈ వ్యాపారంపై ఎవరు ఫిర్యాదులు చేసినా అది తమ పరిధి కాదని తప్పించుకుంటారు. ఇటు మహబూబ్‌నగర్‌లో ఫిర్యాదులందితే నల్లగొండ పేరు, నల్లగొండలో ఫిర్యాదులందితే మహబూబ్‌నగర్ పేరు సాకు చెప్పి మిన్నకుంటారు. కానీ ఈ రెండు జిల్లాల అధికారులకు ఈ వ్యాపారంలో ఆమ్యామ్యాలు ముడుతున్న మాట వాస్తవం.  2009 సంవత్సరంలో ఈ పరిస్థితిని అదిగమించడానికి అప్పటి ఎస్పీలు ఇద్దరు ఒకేసారి కింది స్థాయి అధికారులకు చెప్పకుండా దాడి చేసి జేసీబీలు, ట్రాక్టర్లు, ఇసుక ఫిల్టర్‌లు సీజ్ చేశారు. కొంత కాలం ఈ వ్యాపారానికి చెక్ పడినా మళ్లీ ఈ వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement